‘ఇస్లాంలో పుట్టడమేనా నేను చేసిన పాపం. హిందువుల ప్రాంతంలోకి వెళ్లటమేనా? నేను చేసిన నేరం’ అంటూ 67 ఏళ్ల అబుల్ బషర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై జరిగిన దాడిని ఆయన మీడియాకు వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమబెంగాల్ వెస్ట్‌బుర్దవాన్ జిల్లా రాణిగంఝ్, అసన్‌సోల్ ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన మరోసటి రోజే వాటికి పొరుగునే అండల్‌లో ఓ వృద్ధ అంధ దంపతులతో కొందరు దురుసుగా వ్యవహరించగా.. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
పశ్చిమబెంగాల్ తారాపిత్‌లోని బుద్ధిగ్రామ్‌కు చెందిన బషర్- బదేనా బీబీ(61) వృద్ధ దంపతులు. ఇద్దరూ అంధులు కావటంతో యాచక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో గత మంగళవారం భిక్షమెత్తుకుంటూ చిటదంగ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ వారిని గమనించిన కొందరు వారిని అడ్డగించారు. బషర్ తలపై ఉన్న టోపీని తొలగించి.. ఓం గుర్తు ఉన్న కాషాయం జెండాను పట్టుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఇది హిందువుల ఏరియా.. చెప్పినట్లు చేయకుంటే చంపుతామని చెదిరించారు. దాంతో భయపడ్డ బషర్ జెండాను చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత జై శ్రీరామ్, జై మా తారా నినాదాలు చేయాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చారు.
బషర్ మాటల్లో... ఈ వీడియోపై పలు జాతీయ మీడియా చానెళ్లు బషర్‌ను సంప్రదించాయి. ‘ఆ సమయంలో వణికిపోయాను. నా భయం నా గురించి కాదు. నా భార్యపై దాడి చేస్తారేమోనని. వెంటనే వారితో భగవాన్-అల్లా ఒక్కటేనని.. దేశంలో ఎవరైనా ఎలాంటి మతాన్ని అయినా అనుసరించే స్వేచ్ఛ ఉందని సర్దిచెప్పే యత్నం చేశాను. మేం ఇక్కడికి వచ్చింది బిచ్చమెత్తుకోవటానికి.. ఎవరిని ఇబ్బంది పెట్టటానికి కాదని వివరించాను. కానీ, వాళ్లు నా మాటలు వినలేదు. నినాదాలు చేయాల్సిందేనంటూ నాపై ఒత్తిడి తెచ్చారు. చివరకు వారి స్వరాలు పెరగటంతో భయంతో వాళ్లు చెప్పినట్లే చేయాల్సి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపుతారేమోనని వెనక్కి తగ్గాం’ అని బషర్ వివరించారు. కాగా, అంతకు ముందు రోజు ఘర్షణలు జరిగిన విషయం కూడా తమకు తెలీదని బషర్ చెబుతున్నారు.
విమర్శలు.. ఇక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్‌లో వైరల్ అవుతుండటంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవహారం తమ దాకా రావటంతో అండల్ పోలీస్ స్టేషన్ అధికారి సంజయ్ చక్రవర్తి స్పందించారు. ‘ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అందితే పరిశీలిస్తాం’ అని తెలిపారు. అయితే అది ఏ గ్రూప్ పని అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు వెస్ట్‌బెంగాల్, బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment