
సాక్షి, హైదరాబాద్: చెన్నై ఎక్స్‌ప్రెస్, యోధా, ధమ్ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ అత్యాచారం కేసులో కటకటాలపాలయ్యాడు. శనివారం హైదరాబాద్ హయత్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఢిల్లీకి చెందిన ఓ యువతి (24) సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ముంబైలో ఉండే మొరానీని ఆశ్రయించింది. ఇదే అదనుగా భావించి ఆయన 2015 మార్చిలో ముంబైలోని యువతి ఫ్లాట్‌లోకి వెళ్లి వైన్‌లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారం చేశాడు. యువతి నిలదీయగా ‘నీ నగ్న ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా చెబితే వాటిని బయట పెడతా, నా మాట వినకపోతే చంపుతాను’ అని బెదిరించాడు. దీన్ని అడ్డం పెట్టుకుని పలుమార్లు యువతిపై లైంగిక దాడి చేశాడు. దిల్‌వాలే సినిమాకు సహ నిర్మాతగా ఉన్న కరీమ్ 2015లో హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో ఉన్న రామోజీ ఫిలింసిటీలోని సితారా హోటల్‌కు యువతిని పిలిపించుకుని అత్యాచారం చేశాడు. మొరానీ పలుకుబడికి భయపడిన యువతి అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఎట్టకేలకు ధైర్యం చేసి 2017 జనవరి 10న హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆ యువతి తనపై అసత్య ప్రచారం చేస్తోందని మొరానీ బుకాయించడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు.
కోర్టులో చుక్కెదురు....
తన అరెస్ట్ తప్పదని గ్రహించి 4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. 2జీ స్పెక్ట్రం కేసులో మొరానీ తీహర్ జైలులో శిక్ష అనుభవించిన విషయం పోలీసులు కోర్టు ముందుంచడంతో బెయిల్‌ను రద్దు చేసి మార్చి 22లోపు లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ సెప్టెంబర్ 22లోపు పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన శుక్రవారం సుప్రీం కోర్టుకు వెళ్లగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హయత్‌నగర్‌లోని 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరీం మొరానీని ఈ నెల 24 నుంచి 28 వ తేదీ వరకు ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
అన్ని ఆధారాలు ఉన్నాయి: సీఐ నరేందర్‌గౌడ్
కరీమ్ మొరానీపై యువతి చేసిన ఫిర్యాదు మేరకు తగు ఆధారాలను సేకరించినట్లు హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ జె. నరేందర్‌గౌడ్ తెలిపారు. కమిషనర్, డీసీపీల సూచనలతో గత 8 నెలలుగా ఈ కేసుపై దర్యాప్తు చేసి పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు.