
తల్లి విజయలక్ష్మితో రిత్విక్‌రెడ్డి (ఫైల్)
జీడిమెట్ల: అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, దంతెరపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి అపురూపాకాలనీలో ఉంటున్నాడు. రామిరెడ్డి భార్య విజయలక్ష్మి అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆఫీస్ క్లర్క్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు రంజిత్ రెడ్డి(5), రిత్విక్‌రెడ్డి(3). శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన చిన్న కుమారుడు రిత్విక్‌రెడ్డితో సహా స్కూల్‌కు వెళ్లింది. మధ్యాహ్నం కుమారుడికి భోజనం పెట్టేందుకు చూడగా రిత్విక్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఇద్దరు కలిసి కుమారుడి కోసం గాలించినా ఆచూకీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పాఠశాల అవరణలోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లి చూడగా రిత్విక్ నీటిపై తేలుతూ కనిపించడంతో అతడిని సమీపంలోని అస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
Comments
Please login to add a commentAdd a comment