జశ్వంత్(ఫైల్)
లావేరు : మండలంలోని మురపాక గ్రామానికి చెందిన మెండ జశ్వంత్(5) విషజ్వరంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడి మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ బాలుడికి నాలుగు రోజుల క్రితం జర్వం రావడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మందులిచ్చారు.
వాటిని వాడుతున్నా నయం కాకపోగా, తీవ్రమైన అనారోగ్య సమస్య రావడంతో మరలా తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే బాలుడి తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రక్తంతో కూడిన వాంతులయ్యాయి. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గ్రామంలోనే బాలుడి ఎల్‌కేజీ చదువుతున్నాడు. తండ్రి ఎం శ్రీనివాసరావు ఎచ్చెర్ల మండలంలోని అరిణాం అక్కివలస వద్ద శ్యాంపిస్టన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఎన్‌వీ రమణ, తోటి కార్మికులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment