హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉమామహేశ్వర శర్మ
సికింద్రాబాద్ ,నేరేడ్‌మెట్: సొదరిని కాపురానికి తీసుకువెళ్లకుండా విడాకుల కేసు వేయడం బావమరిదికి నచ్చలేదు. దాంతో బావపై పగను పెంచుకున్నాడు. దాదాపు కొంత కాలం రెక్కీ నిర్వహించాడు. కిరాయి మనుషుల (సుపారి ఇచ్చి)తో బావను అంతమొందించినట్టు ఐదు రోజుల క్రితం సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏంజాల చందర్(35) దారుణ హత్య కేసు విచారణలో పోలీసులు తేల్చారు. సోమవారం కీసరలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తితో కలిసి మల్కాజిగిరి జోన్ డీసీపీ ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. డీసీపీ తెలిపిన మేరకు..
దిల్‌సుఖ్‌నగర్ చెందిన ఏంజాల్ చందర్‌తో మల్కాజిగిరికి చెందిన సుహాసినికి 2010లో వివాహం జరిగింది. కొంతకాలానికే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే చందర్ భార్య నుంచి విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తపై సుహాసిని గృహహింస(డీవీసీ) కేసు వేసింది. మరో కేసు కూడా కోర్టు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. తన సోదరిని కాపురానికి తీసుకువెళ్లకపోవడం, విడాకుల కేసు వేయడంతో చందర్‌పై సొంత బావమరిది అయిన మల్కాజిగిరికి చెందిన గరిసే వినయ్(27)కు నచ్చలేదు. దాంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో బావను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు.
నిందితులు వీరే...
అక్కంపల్లి విజయ్(20) అలియాస్ లక్ష్మణ్ (ఈస్ట్ ఆనంద్‌బాగ్), డబీలపూర్ హేమంత్(19) అలియాస్ నాని(బండచెరువు), సుంకర సతీష్(20) అలియాస్ పాండు( ఈస్ట్ ఆనంద్‌బాగ్), రామగొళ్ల భరత్(21) అలియాస్ మధు (ఈస్ట్ ఆనంద్‌బాగ్), పుట్ట బాలకృష్ణ(19) అలియాస్ చింటూ (నేరేడ్‌మెట్)లతో వినయ్ సుపారీ ఒప్పందం చేసుకున్నాడు. ఈనెల 22న మల్కాజిగిరి కోర్టు కేసు విచారణకు చందర్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యాడు. తిరిగి వెళ్లేందుకు చందర్ కారు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి బావా బావా అంటూ పిలిచి వినయ్‌తోపాటు అనుచరులు చందర్‌పై కత్తులతో దాడి చేశారు. చందర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతనే సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోయారు. కీసరలో అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. అనంతరం వినయ్‌కు వరుసకు సోదరుడైన మేకల చైతన్య కుమార్(26) అలియాస్ చైతన్య (సంతోష్‌నగర్) ఏర్పాటు చేసిన కారులో నిందితులు పారిపోయారని డీసీపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment