స్వాధీనం చేసుకున్న విగ్రహాలను పరిశీలిస్తున్న కమిషనర్ మహేష్ భగవత్.
నాగోలు: దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అన్నదమ్ముళ్లను మహేశ్వరం, సీసీఎస్ ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు.మహబూబ్‌నగర్ జిల్లా, మూసాపేటకు చెందిన సారంగి అలియాస్, ముకుందం (54) అతడి తమ్ముడు సారంగి సంజీవులు అలియాస్ సంజూ నగరానికి వలస వచ్చి ఎల్‌బీనగర్, ఎన్‌టీఆర్ నగర్‌లో ఉంటున్నారు. వెంకటేష్ గతంలో రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేబుల్ వైర్లు చోరీ చేసి కాపర్ వైర్లను అమ్ముకునే వాడు.
మూడు వందలకు పైగా చోరీలకు పాల్పడిన అతడిపై 78 కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం తమ్ముడు సంజూతో కలిసి భువనగిరి, ఎల్‌బీనగర్, నల్లగొండ జిల్లాల్లోని దేవాలయాలను టార్గెట్ చేసుకుని పంజా విసురుతున్నాడు. ఆలయాల్లోని ఉత్సవ విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లేవాడు. ఈ నెల 15న మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట విలేజ్‌లో పురాతన వెంకటేశ్వర స్వామి, అయ్యప్పస్వామి ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన వీరు అందులో ఉన్న అయ్యప్పస్వామి, వెంకటేశ్వరస్వామి పంచలోహా విగ్రహాలు, హుండీ, వెండీ, బంగారం, గంటలు, పూజా సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మహేశ్వరం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. హయత్‌నగర్ పరిధిలో సీతారామస్వామి దేవాలయం, చౌడేశ్వరి దేవాలయం, కంఠమహేశ్వర సుభ్రమణ్య ఆలయం, బీరప్ప దేవాలయం, చిట్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిరుమలనందస్వామి దేవాలయం, మోత్కుర్, బీబీనగర్, మేడిపల్లి, పోచంపల్లి ప్రాంతాల్లోని ఆలయాలలో చోరీ చేసినట్లు తెలిపారు. విగ్రహాలను ముక్కలు చేసి విక్రయించేవారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి పలు విగ్రహాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీలు నాగరాజు, శ్రీనివాస్, నాగరాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ అర్జునయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment