
యోగేశ్వరి
అనంతపురం, మడకశిర/ కదిరి అర్బన్: మడకశిరలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న యోగేశ్వరి అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గోపీయాదవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. కదిరి మండలం చవిటితండాకు చెందిన చంద్రానాయక్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె యోగేశ్వరీ మడకశిరలోని వ్యవసాయ కళాశాలలో బీటెక్ (అగ్రికల్చర్) ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రెండో కుమార్తె మానస ఎస్‌కే యూనివర్సిటీలో బీటెక్‌లో చేస్తోంది. కుమారుడు ఓడీసీలో పదో తరగతి చదువుతున్నాడు. యోగేశ్వరీ గత డిసెంబర్ 31న చవిటితండా నుంచి మడకశిరలోని కళాశాలకు వెళ్లింది.
జనవరి నాలుగో తేదీన ఉదయం రూ.15 వేలు ఫీజు కట్టాలని తండ్రికి ఫోన్‌లో తెలిపింది. ఆదివారం తీసుకుని వస్తానని తండ్రి చెప్పాడు. అదే రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. యోగేశ్వరి కొన్ని సబ్జెక్టులు ఫెయిలైంది. మనస్తాపానికి గురై ఆ రోజు మధ్నాహ్నం కళాశాలలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. విద్యార్థిని బయటకు వెళ్లేటపుడు కళాశాల అధికారులు సంతకం కూడా పెట్టించుకోలేదని తెలుస్తోంది. యోగీశ్వరి రోడ్డుపై నిలబడి ఉండగా తాము చూశామని తోటి విద్యార్థులు తెలిపారు. అదే రోజు రాత్రి 9 గంటలకు యోగేశ్వరి కనపడటం లేదని తల్లిదండ్రులకు కళాశాల నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన మడకశిరకు బయల్దేరి వెళ్లారు. శనివారం అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ గోపీయాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment