
తుపాకీతో బెదిరిస్తున్న మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్(ఫైల్)
తనకు సంబంధం లేని భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కేసులో ఇరుక్కున్నారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని డీసీపీ–1 రంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శివకుమార్ అనే వ్యక్తి సాగర్‌నగర్‌లోని తన స్థలంలో కూలీలను పెట్టి క్లీన్ చేయిస్తుండగా.. కొణతాల రామ్మోహన్ అనే వ్యక్తి వచ్చి అది తన స్థలమని బెదిరించి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన శివకుమార్‌తోపాటు కూలీలను పక్కనే ఉంటున్న మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్ వచ్చి అడ్డుకున్నారు. ఆ స్థలం తన స్నేహితుడిదని, అందులోంచి వెళ్లకపోతే కాల్చేస్తానని తుపాకీ బెదిరించారు. దీనిపై శివకుమార్ ఫిర్యాదు చేయడంతో డీసీపీ–1 రంగారెడ్డి ఆదేశాల మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ఎండాడలోని ఇస్కాన్ ఆలయం దగ్గర ఓ ప్రైవేట్ స్థల వివాదంలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కొణతాల రామ్మోహన్‌పై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వసంతకుమార్, రామ్మోహన్‌లపై బి.శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, మాజీ మంత్రి బెదిరిం చడం వాస్తవమని తెలితే అరెస్ట్ చేస్తామని నగర డీసీపీ–1 రంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలివి.
40 ఏళ్ల కిందట సర్వే నంబర్ 108/1లో వ్యాపారవేత్త చెరుకూరి వెంకటరాజు నుంచి 75 సెంట్ల స్థలాన్ని ప్రముఖ సినీ డైరెక్టర్ తల్లి కోడూరు రాజనందిని, సత్యనారాయణ ప్రసాద్, బలుసు రామారావులు చెరో 25 సెంట్ల చొప్పున కొనుగోలు చేశారు. అక్కడకు నాలుగేళ్ల తర్వాత చెరుకూరి వెంకటరాజు అనే వ్యక్తి రాజనందిని కొనుగోలు చేసిన భూమికి లేఅవుట్ పేరుతో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి రహస్యంగా సంపుటూరి వెంకట రమణారెడ్డి అనే వ్యక్తికి అమ్మేశాడు. ఇది తెలిసిన ఆమె భీమిలి మున్సిఫ్ కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆమెకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. ఈ క్రమంలో రాజనందిని చెందిన స్థలాన్ని 2006లో సత్యనారాయణ ప్రసాద్ కొనుగోలు చేసి తన కుమారుడు శివకుమార్(బాధితుడు), కుమార్తె నగినా పేర్ల మీద చెరో 505 గజాలు చొప్పున 1010 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగతా భూమిని రోడ్డు కోసం వదిలేశాడు. అదే సమయంలో ఇదే భూమిని తనకు విక్రయించారని కొణతాల రామ్మోహన్ అనే వ్యక్తి బలుసు శివకుమార్‌పై కోర్టులో కేసు వేశాడు. దీనికి కోర్టు ‘స్టేటస్ కో’ఆర్డర్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆ భూమికి ‘కేర్ టేకర్’గా ఒమ్మి కొండలరావును నియమించుకున్నారు.
వివాదానికి కారణమైన స్థలం ఇదే
మాజీ మంత్రి బెదిరింపు
ఈ భూమిలో కలుపు మొక్కలు తొలగించడానికి బలుసు శివకుమార్ ఈ నెల15వ తేదీన కూలీలను పెట్టి పనులు చేయిస్తున్నాడు. ఆ క్షణంలో అక్కడకు చేరుకున్న కొణతాల రామ్మెహన్ కూలీలను బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని కూలీలు శివకుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో తన స్నేహితుడు భూమి బాధ్యతను తనకు అప్పగించారని తుపాకీ పట్టుకుని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కూలీ లను బెదిరించారు. తక్షణమే పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా కూలీలు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న శివకుమార్ ఇదేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో తనతో పాటు కూలీలను కూడా మాజీ మంత్రి చంపేస్తానని బెదిరించాడని శివకుమార్ తెలిపారు. దీంతో కూలీలు పరుగులు తీశారు.
‘తాను కేవలం ప్రశ్నించాను, ప్రాణరక్షణ కోసం తుపాకీని వెంట తీసుకువెళుతుంటాను. ఈ సంఘటన అకస్మాత్తుగా జరిగిందే తప్ప దీని వెనుక మరే ఉద్దేశం లేదు’ అని మాజీ మంత్రి తన వర్గీయుల వద్ద చెప్పినట్టు సమాచారం. కాగా.. ఈ విషయంపై శివకుమార్ డీసీపీ–1 రంగారెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు రాత్రి డీసీపీ ఆరిలోవ పోలీసులకు కేసు అప్పగించారు. ఆరిలోవ సీఐ కిశోర్‌కుమార్ మంగళవారం దీనిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, బాధితుడిని మాజీ మంత్రి బెదిరించడం వాస్తవమని తెలితే అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు.
హతమార్చాలనే తుపాకీతో బెదిరించారు
ఆదివారం ఉదయం పది గంటలకు ఫోన్ వచ్చింది. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తమను బెదిరిస్తున్నారని కూలీలు చెప్పారు. నేను వెంటనే అక్కడకు చేరుకున్నాను. ఆయన కూలీలతో పాటు నాపై కూడా రివాల్వర్ తిప్పుతూ.. ఈ భూమి మీది కాదు. మీ భూమి వేరే చోట ఉంది. వెళ్లండని గట్టిగా అరుస్తూ దూర్భషలాడారు. నా సంగతి నీకు తెలియదు.. మీ నాన్నని అడుగు.. చెబుతాడు. చెప్పినట్టు వినకపోతే నీ అంతు చూస్తా అని అన్నారు. నన్ను హతమార్చాలనే బెదిరించారు.
– బలుసు శివకుమార్, బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment