సాక్షి, నెల్లూరు(క్రైమ్): దుండగులు పక్కాగా రెక్కీ వేశారు. వృద్ధురాలు ఒంటిరిగా ఉందన్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. మున్సిపల్ ఉద్యోగులమంటూ ఇంట్లోకి వెళ్లారు. ఇంటి పన్ను కాగితాలు చూసి, డ్రెయినేజీ పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ ఆమెను బురిడీ కొట్టించి బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు..
పరమేశ్వరీనగర్ మూడోక్రాస్ రోడ్డుకు చెందిన పీవీ మోహన్‌రెడ్డి, రామసీతమ్మలు దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. పిల్లలు ఒకరు బెంగళూరు, మరొకరు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. రామసీతమ్మ పరమేశ్వరీనగర్‌లోనే ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం పట్టపగలు ఇద్దరు దుండగులు తాము మున్సిపాలిటీ ఉద్యోగులమని డ్రెయినేజీ పరిశీలన నిమిత్తం వచ్చామంటూ ఆమె ఇంట్లోకి వెళ్లారు. తొలుత ఇంటిపన్నుకు సంబంధించిన కాగితాలు చూపమని అడగ్గా ఆమె ఇంట్లోకి వెళ్లింది. బీరువా తెరిచి కాగితాలు తీసుకువచ్చింది. ఈక్రమంలో బీరువా తాళాలు వేయడం మరిచిపోయింది. కాగితాలు పరిశీలించిన దుండగులు డ్రెయినేజీని చూపెట్టమని అడగ్గా ఆమె ఇంటి వెనుక వైపునకు వారిని తీసుకెళ్లింది.
ఈక్రమంలో ఓ దుండగుడు ఆమెను మాటల్లో దించగా మరో వ్యక్తి బీరువాలోని రూ.2.45 లక్షలు విలువచేసే పన్నెండున్నర సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 వేల నగదు అపహరించారు. అనంతరం ఇద్దరు దుండగులు బైక్‌పై వెళ్లిపోయారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి బాధితురాలు తన ఆధార్‌కార్డు బీరువా వద్ద కిందపడి ఉండడాన్ని గమనించింది. బీరువాను తెరిచి చూడగా అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. దీంతో రామసీతీమ్మ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ మధుబాబు, ఎస్సై రవినాయక్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును ఆమెను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి ఎస్సై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment