
రవాణా వాహనానికి రేడియం వేస్తున్న ఆర్టీఏ అధికారులు
మహబూబ్‌నగర్ క్రైం/ వనపర్తి క్రైం : దేశంలో రోగాల బారినపడి చనిపోయేవారి కన్నా.. ప్రమా దాల్లో మరణించే వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. కానీ మృత్యువుకు ఎదురెళ్లాలని ఎవరూ కోరుకోరు.. అయితే అస్తవ్యస్త రహదారులు, అధికారు ల అలసత్వం, వాహనదారుల నిర్లక్ష్యం ఎంతోమందిని బలిగొంటోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నా ఉన్నతాధికారులు తమ కుర్చీ వీడటంలేదు.
నిగనిగలాడే రహదారులు.. గంటకు 100–150 కి.మీ వేగం అందుకోగల వాహనాలు.. ఇంకేముంది డ్రైవర్ల చేతిలో స్టీరింగ్ కళ్లెం లేనిగుర్రమవుతోంది. మితిమీరిన వేగం ప్రయాణికులకే కాదు ప్రజలకూ ప్రాణాంతకమవుతోంది. అద్భుతంగా రహదారు లు నిర్మించామని గొప్పలు చెప్పుకునే పాలకులు భద్రతా ప్రమాణాలపై నిర్లక్ష్యం చూపడం శాపం గా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన జాతీయ రహదారిపై కనీసం కొన్ని జంక్షన్‌లలో కనీసం వెలుగునిచ్చే విద్యుత్ లైట్లు లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 185 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ.. అమాయకులు బలైపోతున్నాయి.
ఇరువైపులా భారీ వాహనాలు
జిల్లాలోని అన్ని రహదారులపై నిబంధనలు అమ లు కావడం లేదు. ముఖ్యంగా రోడ్డు వెంట ఉండే దాబాల ముందు లెక్కకు మించి భారీ వాహనా లు, కార్లు నిలుపుతున్నారు. అక్కడే వాహనాలకు మరమ్మతు, పంక్చర్లు చేసుకోవడమే కాకుండా భోజనం తయారు చేసుకుంటున్నారు. దీంతో రోడ్డు పై వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రహదారి వెంట 24 గంటలు వాహనంలో తిరుగుతూ పర్యవేక్షించాల్సిన (హైవే పెట్రోలింగ్) అధికారులు కనిపించడం లేదు. దీం తో డ్రైవర్లకు నచ్చిన చోట వాహనాలను నిలుపుతున్నారు. వాహనాలను నిలిపి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను తక్కువ మంది వినియోగించుకుంటున్నారు.
65 శాతం దాటుతున్న బాధితులు
అంగవైకల్యాలు, అనారోగ్యంతో జబ్బుల బారిన పడుతున్న వారు, ముందస్తు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై సర్వే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిధులు సమకూర్చి 29 రాష్ట్రా ల్లో ఆయా అంశాలపై అధ్యయనం చేశారు. ఇందు లో భారత వైద్య పరిశోధన మండలి, భారత ప్రజారోగ్య ఫౌండేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యుయేషన్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి.
అంగవైకల్యం, ముందస్తు మరణాలు ఇతర వ్యాధులకు రోడ్డు ప్రమాద క్షతగాత్రుల వేదనలే కారణంగా నిర్ధారించాయి. గతంతో పోల్చితే క్షతగాత్రులు, అంగవైకల్యానికి గురయ్యే వారి సంఖ్య ప్రస్తుతం 65 శాతానికి చేరుకుందని తేల్చాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్, యువత అజాగ్రత్త డ్రైవింగ్, విశ్రాంతి లేకుండా పెద్ద వాహనాలు నడపడంతో ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. అయితే సర్వే ఆధారంగా చూస్తే గాయపడే వారి సంఖ్యలో మూడో వంతుకు పైగా పురుషులే ఉన్నట్లు నివేదికలో తేల్చారు.
ప్రమాదకర ప్రాంతాలు ఇవే..
ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను ఆర్టీఏ, పోలీస్ అధికారులు గుర్తిం చారు. వాటిలో తిమ్మాపూర్ ఎక్స్‌రోడ్, ఆశన్నదాబా, తిమ్మార్‌పూర్ క్రాస్‌రోడ్, షాద్‌నగర్ ఎక్స్‌రోడ్, రాయికల్, బాలానగర్ వంతెన దగ్గర, రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, గొల్లపల్లి, కావేరమ్మపేట అర్‌అండ్‌బీ అతిథి గృహం, జడ్చర్ల, మల్లెబోయిన్‌పల్లి, భూత్పూర్, కందూరు, అడ్డాకుల, వెల్టూరు, మోజర్ల, కనిమెట్ట, కొత్తకోట మధర్ థెరిస్సా జంక్షన్, పాలెం, రాణిపేట ఎక్స్‌రోడ్, బీచుపల్లి, ఎర్రవల్లి ఎక్స్‌రోడ్, కొట్టం ఇంజనీరింగ్ కళాశాల, జింకలపల్లి, నారాయణపురం, బోరవెల్లి స్టేజీల దగ్గర నిత్యం లేదో ఒక ప్రమాదం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment