స్నాచింగ్‌ చేసిన మరుసటి రోజు మరో చోరీ | Chain Snatching Gang Held in Hyderabad | Sakshi
Sakshi News home page

కిలాడీలు..

Published Wed, Jun 17 2020 9:21 AM | Last Updated on Wed, Jun 17 2020 9:21 AM

Chain Snatching Gang Held in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి, మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ద్వయం శక్తి మయూర్, కాలా వికాస్‌ విచారణలో మరో నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శక్తి మయూర్‌ ప్రోద్బలంతో ఈ ద్వయం స్నాచింగ్‌ చేసిన మరుసటి రోజు మరో ఇద్దరితో కలిసి అఫ్జల్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ బార్‌లో చోరీ చేసినట్లు తేలింది. మయూర్,వికాస్‌లను సోమవారం అరెస్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈ విషయం గుర్తించింది. దీంతో మంగళవారం మిగిలిన ఇద్దరు నిందితుల్నీ పట్టుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఇప్పటికే ముషీరాబాద్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించిన మయూర్‌ను ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు.

జల్సాల కోసం జత కలిసి..
పురానాపూల్‌లోని ఎస్వీనగర్‌కు చెందిన శక్తి మయూర్‌ తారామండల్‌ కాంప్లెక్స్‌లోని ఓ ప్రైవేట్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పదో తరగతి వరకు గజ్వేల్‌లో చదివిన ఇతగాడు ఆపై చదువుకు స్వస్తి చెప్పి సిటీకి వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేయడానికి అలవాటుపడ్డాడు. మద్యం, జూదం తదితర వ్యసనాలకు బానిసైన ఇతగాడికి పురానాపూల్‌కు చెందిన కాలా వికాస్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి సంచరించడం మొదలెట్టారు. వీరికి తాము చేస్తున్న ఉద్యోగాల్లో నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వచ్చేది. వ్యసనాలకు బానిసలైన వీరికి ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో తేలిగ్గా డబ్బు పంపాదించడానికి నేరాలు చేయాలని శక్తి మయూర్‌ పథకం వేశాడు. దీనికి వికాస్‌ కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మధ్య మండల పరిధిలోని అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. రెండుమూడు రోజుల పరిశీలన అనంతరం ముషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో స్నాచింగ్‌ చేయడం అనువని గుర్తించారు. దీంతో ఈ నెల 7న తమ వాహనంపై మరోసారి అక్కడికి  వెళ్లారు. వాకింగ్‌కు వచ్చిన పార్వతిదేవి అనే వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ముషీరాబాద్‌ ఠాణాలో కేసు నమోదైంది. 

కేసు ఛేదించిన క్రమంలో..  
కేసును ఛేదించేందుకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్‌ షానవాజ్‌ షరీఫ్‌ టి.శ్రీధర్‌ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌తో పాటు సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించి మయూర్, వికాస్‌లను పట్టుకున్నారు. మయూర్‌ వ్యవహారాన్ని అధికారులు అనుమానించారు. అతడు మరికొన్ని నేరాలు చేసి ఉండవచ్చని భావించారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీయగా.. మరో ముగ్గురితో కలిసి ఈ నెల 8 రాత్రి అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని ఓ మూసి ఉన్న బార్‌లో చోరీ చేసినట్లు వెల్లడైంది. పురానాపూల్‌కు చెందిన కె.ఆతిష్, షాహినాయత్‌గంజ్‌కు చెందిన ఎం.కనిష్క్‌లతో కలిసి మయూర్, వికాష్‌లు చోరీలకు స్కెచ్‌ వేశారు.

కోవిడ్‌ నిబంధనల్లో భాగంగా నగర వ్యాప్తంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసి ఉంటాయని, వాటిని టార్గెట్‌ చేసుకుంటే తాము చిక్కబోమని పథక రచన చేశారు. అఫ్జల్‌గంజ్‌ పరిధిలో సీబీఎస్‌కు సమీపంలో ఉన్న రవీంద్ర బార్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ నెల 8న తెల్లవారుజామున నలుగురూ కలిసి అక్కడకు చేరుకున్నారు. మయూర్, వికాస్‌లు బయట ఉండి పరిస్థితులు గమనిస్తుండగా.. మిగిలిన ఇద్దరూ కిటికీ పగల కొట్టడం ద్వారా బార్‌లోకి ప్రవేశించారు. ఆ బార్‌ మొదటి అంతస్తు నుంచి 20 మద్యం  బాటిళ్లను చోరీ చేసుకువచ్చారు. వీటిలో 18 బాటిళ్లను విక్రయించిన ఈ నలుగురూ ఆ డబ్బును పంచుకుని జల్సాలు చేశారు. దీనిపై అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన మయూర్, వికాస్‌ల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆతిష్, కనిష్క్‌లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ వీరి నుంచి రూ.10 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించింది. ఇప్పటికే మయూర్,  వికాస్‌లను ముషీరాబాద్‌ పోలీసులు స్నాచింగ్‌ కేసులో రిమాండ్‌ చేశారు. దీంతో అఫ్జల్‌గంజ్‌ పోలీసులు బార్‌ చోరీ కేసులో వీరిపై కోర్టు ద్వారా పీటీ వారెంట్‌ తీసుకుని అరెస్టు చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement