చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్టుఅనుమానిస్తున్న వ్యక్తి సీసీఫుటేజీ, బాధితురాలు వరలక్ష్మి.పుస్తెల తాడులో మిగిలిన పుస్తెలు
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): గోపాలపట్నంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కారులో కూర్చుని ఉన్న మహిళ మెడలో సుమారు పదిన్నర తులాల బంగారు నగలు తెంచుకుని పారిపోయాడు. గోపాలపట్నం నేర విభాగం పోలీసులు తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం గృహ ప్రవేశం కార్యక్రమానికి పెదగంట్యాడ వుడాకాలనీ నుంచి కుటుంబ సభ్యులతో గోపాలపట్నం మౌర్య సినిమాహాలు ఎదురుగా ఉన్న ఇంటికి వచ్చారు. అయితే గానుగుల వరలక్ష్మి మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమెను కారులో ఉంచి గృహప్రవేశం జరుగుతున్న ఇంటికి కుటుంబ సభ్యులు వెళ్లారు. వరలక్ష్మి గాలి ఆడకపోవడంతో కారు తలుపు తెరిచి విశ్రాంతి తీసుకుంటోంది. ఇది గమనించిన దొంగ నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా మెడలో ఉన్న రెండున్నర తులాల నల్లపూసల దండ, 3 తులాల పుస్తెల తాడు, మూడు తులాల మూడు పేటల గొలుసు, 2 తులాల పగడాల గొలుసు తెంచుకొని గోపాలపట్నం వైపు పారిపోయాడు.
అప్రమత్తమైనా..
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆమె గొలుసు పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చేతిలో పుస్తెలు.. గొలుసుల్లో చిన్నచిన్న ముక్కలు ఆమె చేతిలో ఉన్నాయి. ఆభరణాలు పట్టుకునే ప్రయత్నంలో ఆమె చేతికి గాయాలయ్యాయి. సుమారు పదిన్నర తులాల బంగారు ఆభరణాలు పోయినట్లు బాధితులు చెబుతున్నారు. సీఐ కాళిదాసు, ఎస్‌ఐలు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఏఎస్‌ఐ సత్యనారాయణ, రైటర్ సామ్యూల్ దర్యాప్తు చేస్తున్నారు.
చురుగ్గా సాగిన దర్యాప్తు
అప్రమత్తమైన గోపాలపట్నం నేర విభాగం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. స్థానికంగా ఉన్న దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీలను పరిశీలించి పారిపోయిన దొంగ ఫుటేజీ సేకరించారు. దీని ద్వారా దొంగను పట్టుకుంటామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment