దొంగలొస్తున్నారు..! జాగ్రత్త..! | Chain Snatching In Khammam | Sakshi
Sakshi News home page

దొంగలొస్తున్నారు..! జాగ్రత్త..!

Published Wed, Aug 1 2018 12:02 PM | Last Updated on Wed, Aug 1 2018 12:03 PM

Chain Snatching In Khammam   - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దొంగలు.. గొలుసు దొంగలు వస్తున్నారు. జాగ్రత్త.. మహిళలంతా జర జాగ్రత్త. ‘పోలీస్‌ కమిషనరేట్‌లో ఉన్నాం.. మనకేం భయం..!!’ అనుకుని, ఏమరుపాటుగా... అజాగ్రత్తగా ఉండకండి.     ఎందుకంటే... పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గొలుసు దొంగలు ఎక్కువయ్యారు. గొలుసు దొంగతనాలు పెరిగాయి. లబోదిబోమంటూ రోదిస్తున్న బాధిత మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్చ్‌... దొంగలు మాత్రం పోలీసుల చేతికి చిక్కడం లేదు. అందుకే... పోలీస్‌ కమిషనరేట్‌లో ఉన్నామనుకుని, మనకేం కాదనుకుని ఏమరుపాటుగా, అజాగ్రత్తగా ఉండొద్దు.

ఖమ్మంక్రైం: అది, ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతంలోని పంపింగ్‌ వెల్‌ రోడ్‌ ప్రాంతం. ఆమె పేరు వాణి. ఒక రోజున మధ్యాహ్నం వేళ బయటి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. మెష్‌ డోర్‌ దగ్గరకు వేసింది. హాల్లో ఏదో పనిలో నిమగ్నమైంది. బెడ్రూంలో ఆమె భర్త నిద్రలో ఉన్నాడు. ఇంతలో, మెష్‌ డోర్‌ తీసుకుని ఎవడో లోనికొచ్చాడు. ఆమె గమనించేలోగానే దగ్గరగా వచ్చాడు. కత్తి తీసి ఆమె మెడపై ఆనించాడు.

అరిస్తే కోసేస్తానని బెదిరించాడు. చేతిపై గాటు పెట్టాడు. గొలుసు లాక్కున్నాడు. పారిపోయాడు.. మాయమయ్యాడు.  అది, ఖమ్మం వన్‌ టౌన్‌లోని ప్రభాత్‌ టాకీస్‌ రోడ్‌ ప్రాంతం. ఆ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఆగంతకులు వెంబడించారు. వీరిని ఆ దంపతులు గమనించలేదు. ఆ ఆగంతకుల వాహనం దగ్గరగా వచ్చింది. ఒకడు, ఆమె మెడలోని గొలుసును లాక్కున్నాడు.

ఆ వెన్వెంటనే ఆ వాహనం వాయు వేగంతో అక్కడి నుంచి మాయమైంది. ఆమె కింద పడిపోయింది. ఇది ఇటీవల జరిగింది.  అది, ఖమ్మం వన్‌ టౌన్‌లోని ముస్తాఫానగర్‌ ప్రాంతం. ఓ వృద్ధురాలు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఒకవైపు వయోభారం. మరోవైపు శారీరక అశక్తత. గొలుసు దొంగలు (చైన్‌ స్నాచర్లు) గమనించారు. ద్విచక్ర వాహనంపై నెమ్మదిగా అనుసరించారు. చుట్టుపక్కల వాతావరణం అనుకూలంగా ఉందనుకున్న క్షణాన, దగ్గరగా వచ్చారు.

మెడలోని గొలుసును లాక్కున్నారు. క్షణాల్లో మాయమయ్యారు. మూడు రోజుల కిందట ఇది జరిగింది.  అది, ఖమ్మం రూరల్‌ మండలంలోని బైపాస్‌ రోడ్‌ ప్రాంతం. ఓ ఇంట్లోకి ఆగంతకుడు జొరబడ్డాడు. అప్పుడు ఆ ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది. ఆమెను బెదిరించి మెడలోని గొలుసును లాక్కున్నాడు. ఈ హఠాత్పరిణామం నుంచి ఆమె బయటపడి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. అప్పటికే ఆ దొంగ మాయమయ్యాడు. ఇది నెల క్రితం జరిగింది.

 దేనికి సూచిక..? 

పైన ఇచ్చిన నాలుగు ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. వీటి నుంచి మనం తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏమిటంటే...  నగరంలో గొలుసు దొంగలు నిర్భయంగా సంచరిస్తున్నారు. ఎంత నిర్భయంగా అంటే... ఏకంగా ఇంట్లోకి జొరబడి, అరిస్తే చంపుతానని బెదిరించి, మెడలోని గొలుసును లాక్కుని పారిపోయేటంత...!  పోలీసులు పట్టుకుంటారనిగానీ, జనాలకు దొరికిపోతామనిగానీ ఈ గొలుసు దొంగలు ఏమాత్రం భయపడడం లేదు.

పైన ఇచ్చిన నాలుగు ఘటనల్లో ఒక్క  దొంగ కూడా అటు పోలీసులకుగానీ, ఇటు జనాలకుగానీ పట్టుబడలేదు.  ఒకప్పుడు, గొలుసు దొంగతనాలంటే.. రాత్రి వేళలోనో, నిర్మానుష్య ప్రాంతంలోనో, మహిళలు ఒంటరిగా వెళుతున్నప్పుడో జరుగుతాయని ఇప్పటివరకూ మనకు తెలిసిన విషయం. కానీ, ఏకం గా ఇంట్లోకి జొరబడి గొలుసులు లాక్కెళుతున్నా కూడా పోలీసులు దొరికించుకోలేరని, జనాలు పట్టుకోలేరని దొంగలు ధీమాతో ఉన్నట్టున్నారు. మన కమిషనరేట్‌ పోలీసుల వైఫల్యానికి, మన మహిళల ఏమరుపాటుకు–అజాగ్రత్తకు, మన జనాలు అప్రమత్తంగా లేరనడానికి ఇవి సూచికలు. 

ఏమిటి చేయడం...? 

‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌’ అన్నారు మన పెద్దలు. ‘ఏదేని సమస్య వచ్చిన తరువాత పరిష్కరించుకోవడం కాదు. అసలు ఆ సమస్యనే రాకుండా చూసుకోవడం మేలు’ అనేది దీనర్థం. 
మన రక్షణ బాధ్యతను మనంగానీ, మనవాళ్లుగానీ, మన చుట్టుపక్కల వాళ్లుగానీ.. ఎవ్వరూ పట్టించుకోకుండా, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుం డా.. మన పోలీసులపై భరోసాతో ఉంటే... ఇదిగో, ఇలాగే జరుగుతుంది.

ఇకనైనా, ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. గొలుసు దొంగతనాల తీరుపై, దొంగల సంచారంపై అవగాహన పెంచుకోవాలి. తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘మన అప్రమత్తతమే మనకు రక్ష’ అనే విషయాన్ని సదా గమనంలో ఉంచుకోవాలి. దొంగలొస్తున్నారు... ! జాగ్రత్త..!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement