చేతిలో ఫోన్‌ ఉంది కదా అని షాపింగ్‌ చేస్తే | Cheated With Online Shoppings | Sakshi
Sakshi News home page

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని షాపింగ్‌ చేస్తే

Published Tue, Nov 19 2019 11:20 AM | Last Updated on Tue, Nov 19 2019 11:20 AM

Cheated With Online Shoppings - Sakshi

ప్రపంచం కుగ్రామం అయిపోంది. ఇంటికి.. ఒంటికి కావాల్సిన, అవసరమైన అత్యాధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. వేల కిలో మీటర్ల దూరంలోని షాపుల్లో ఉన్న ఇలాంటి నచ్చిన..మెచ్చిన వినిమయ వస్తువులు ఇంటి ముగింటకే వచ్చేస్తున్నాయి. అయితే ఈ లావాదేవీల తర్వాత మోసాలు పొంచి ఉన్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం పేరు, చిరునామా, మొబైల్‌ ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ అడ్రస్‌లు ఇస్తున్నాము. వీటి ఆధారంగా కొందరు మోసగాళ్లు ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నారు.  మీరు ఫలాన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ నుంచి ఆర్డర్‌ తీసుకున్నారు.. అందులో సదరు కంపెనీ లక్కీ డ్రా నిర్వహించడంతో మీకు బహుమతులు వచ్చాయంటూ నమ్మకంగా చెబుతున్నారు. నిజంగానే ఆ కంపెనీ నుంచి ఆర్డర్‌ తీసుకుని ఉండడంతో వీరు చెప్పేదాన్ని బట్టి మోసగాళ్లు కాదు.. ఇదంతా నిజమే అనిపిస్తోంది. ఇలా మోసపోవడంలో అత్యధికులు విద్యావంతులే ఉండడం గమనార్హం. 

సాక్షి, నెల్లూరు: చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది కదా.. బజారుకెందుకు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసుకుందామనుకునే వారిని ఆన్‌లైన్‌ మోసగాళ్లు తెలివిగా మోసం చేస్తున్నారు. కొందరు లాటరీల పేరుతో మోసం చేస్తే.. ఇంకొందరు వస్తువులకు బదులు రాళ్లు.. రప్పలు పంపించి మోసాలు చేస్తున్నారు. వారి మోసానికి బలైపోయి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలో విద్యావంతులే ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకొని లక్షలు పొగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మార్కెట్లోకి అత్యాధునిక వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో షాపింగ్‌ కూడా అర చేతికిలోకి రావడంతో కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో క్యాష్‌ ఆన్‌ డెలివరీతో ఆర్డర్‌ ఇచ్చిన వస్తువులు నేరుగా ఇంటికే చేరడానికి పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు, మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చేస్తున్నాము. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పూర్తయి తర్వాత ఒకటి.. రెండు రోజులకు వారి ఫోన్‌ నంబర్స్‌కు సదరు ఆన్‌లైన్‌ కంపెనీ పేరుతో ముందు మేసేజ్‌ వస్తుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో వస్తువులు కొనుగోలు  చేసినదాన్ని బట్టి వారి ఫోన్‌కు మెసేజ్‌ పంపుతారు.

ఆ మెసేజ్‌లో మీరు షాపింగ్‌ చేసినందుకు మీ ఫోన్‌ నంబర్‌ లక్కీడిప్‌లో ఎంపికైందని, రూ.50 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయంటూ మెసేజ్‌ పెడతారు. వెంటనే వారికి ఫోన్‌ ద్వారా  లైన్‌లోకి వచ్చి మాటలు కలుపుతారు. అంతకు ముందే అదే ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీ పేరుతో వస్తువులు కొనుగోలు చేసి ఉండడంతో ఇది నిజమే అని నమ్ముతాం. ఇదిగో మీకు వచ్చిన  గిప్ట్‌ కూపన్‌ చూడండి వాట్సాప్‌కు పంపిస్తారు. ఆ వస్తువులు వద్దని చెబితే అయితే అంత నగదు మీ బ్యాంక్‌ ఖాతాలో వేస్తామంటూ నమ్మిస్తారు. నగదు మీ ఖాతాలో వేయాలంటే  ముందుగా ఎస్టిమేషన్‌ చార్జీలు, జీఎస్టీ, ఎక్స్‌ట్రా చార్జీలకు నగదు పంపిస్తే చాలు గిఫ్ట్‌ మొత్తం మీ ఖాతాలో వేస్తామని నమ్మించి వారి బ్యాంక్‌ ఖాతాలోకి నగదు వేయించుకుంటున్నారు. వారు ఆలోచించుకునే టైమ్‌ కూడా ఇవ్వకుండా రోజు ఒత్తిడి పెంచి నగదు వేయించుకుని మోసగాళ్లు మాయమవుతున్నారు.

ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చిందంటూ కూపన్‌ 

ముంబయి కేంద్రంగా.. 
ముంబాయి కేంద్రంగా ఓ ముఠా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారి పోన్‌ నంబర్లు పట్టుకొని ఇలాంటి తరహా మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఫోన్‌కు మెసేజ్‌ పెట్టడం, ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. అన్ని భాషలు వచ్చిన వ్యక్తులు ఆ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ముఠాల్లో మహిళలు ఉండడం విశేషం. తెలుగు మాట్లాడే వారికి తెలుగు భాష వచ్చిన వారితోనే ఫోన్‌ చేయిస్తున్నారు. అవతలి వారి రెస్పాన్స్‌ను బట్టి మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇదిగో గిఫ్ట్‌ వాహనం అంటూ కొత్త కార్లు వాట్సాప్‌ మెసేజ్‌లు పెట్టి మోసం చేస్తున్నారు. ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చిందంటూ కూపన్‌ కూడా పెడుతున్నారు. రూపేశ్‌ జా ఫోన్‌ నంబర్‌ 9667071295 ఫోన్‌ ద్వారా చీటింగ్‌ చేస్తున్నారు. ఆ మోసగాళ్లు కార్పొరేషన్‌ బ్యాంక్‌ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు.

 
మోసపోయేది.. విద్యావంతులే! 
ఆన్‌లైన్‌ చీటర్స్‌ చేతిలో విద్యావంతులే మోసపోతున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌పై మోజుతో షాపింగ్‌ చేసుకుంటున్న వారినే టార్గెట్‌ చేస్తూ ఇలాంటి మోసాలు చేస్తున్నారు. వైద్యులు, టీచర్స్, ఇంజినీర్లు కూడా ఇలాంటి మోసాల బారిన పడుతుండడం గమనార్హం. ఇటీవల నెల రోజుల  వ్యవధిలో మోసపోయిన బాధితులు సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చాలా మంది కూడా ఆన్‌లైన్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయి పరువుకు వెరసి వెలుగులోకి తేవడం లేదు. ఇలాంటి మోసాలపై జాగ్రతగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.  

అనేక మోసాలు.. ఇవిగో ఉదాహరణలు 
నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. అతను ఆపిల్‌ కంపెనీ ‘ఎయిర్‌ పాడ్స్‌’ వైర్‌లెస్‌ బ్లూటూత్‌ హెడ్‌ సెట్‌ కోసం ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీలో ఆర్డర్‌ ఇచ్చాడు. వీటి విలువ రూ.18,500. అయితే అతనికి వచ్చిన ఆర్డర్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ చేస్తే బాక్స్‌ నిండా ‘లక్కముద్ద’ను పంపించారు. దీనిపై సదరు యువకుడు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి సరిపెట్టారు. 

నెల్లూరులోని  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌లో  పని చేసే ఒక యువతి ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసింది. ఆమె ఫోన్‌కు రెండు రోజుల తర్వాత మెసేజ్‌ వచ్చింది. మీ ఫోన్‌ నంబర్‌కు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చిందని, రూ.15 లక్షల విలువైన మహీంద్ర ఎక్స్‌యువీ 500 కారు ఇస్తామని మెసేజ్‌ పెట్టారు. అనంతరం ఫోన్‌లో మాటలు కలపడంతో ఆ యువతి కారు వద్దని చెప్పడంతో దానికి సమాన విలువ మొత్తాన్ని మీ బ్యాంక్‌ ఖాతాలో వేస్తామంటూ చెప్పారు. అయితే అందులో 5 శాతం నగదు ట్రాన్స్‌ఫర్‌ చార్జీస్‌ వేయాలంటూ చెప్పి రూ.30 వేలు వారి బ్యాంక్‌ ఖాతాలో వేయించుకున్నారు. ఆపై జీఎస్టీ చార్జీలంటూ మరో రూ.51,500, ఇంకోసారి ఇతరత్రా చార్జీల పేరుతో రూ.35 వేలు, రూ. 20 వేలు ఇలా దాదాపు రూ.1.5 లక్షల వరకు బ్యాంక్‌ ఖాతాలో వేయించుకున్నారు. ఆపై నగదు పంపిస్తామంటూ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశారు. 

ఈ కారు లాటరీలో వచ్చిందంటూ పంపిన ఫోటో

నగరంలో ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు కూడా ఇదే తరహాలో మోసపోయాడు. ఆ వైద్యుడు కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడంతో అతని ఫోన్‌కు అదే తరహాలో మెసేజ్‌ వచ్చింది. ఆయన కూడా దాదాపు రూ.8 లక్షల వరకు వారి బ్యాంక్‌ ఖాతాలో వేసి మోసపోయాడు.

రూ.15 లక్షల నగదు బహుమతి వచ్చిందంటూ పంపిన మెసేజ్‌ 
అయితే ఆ వైద్యుడికి మాత్రం రూ.కోటి విలువైన కారు, పలు ఖరీదైన వస్తువులు వచ్చాయంటూ బురిడి కొట్టించి నగదు కాజేశారు. డాక్టర్‌ అయి ఉండి కూడా ఆ మోసగాళ్ల మాయలో పడిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement