బాలాజీ నాయుడు
సాక్షి, సిటీబ్యూరో: వివిధ పథకాల పేర్లు చెప్పి రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని టోకరా వేసే ఘరానా మోసగాడు బాలాజీ నాయుడు మళ్లీ చిక్కాడు. ఇప్పటి వరకు 31 మంది ప్రజా ప్రతినిథులకు టోకరా వేసిన అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 29 పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించినా అతడి పంథా మారలేదు... తాజాగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నుంచి రూ.2.5 లక్షలు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి నుంచి రూ.50 వేలు కాజేశాడు. ఈ రెండు కేసులకు సంబంధించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు జాయింట్ సీపీ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. ఇతను ఇప్పటి వరకు 20 సార్లు జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు.
బీటెక్ చదివి... ఏసీబీకి చిక్కి...
తూర్పు గోదావరి జిల్లా, కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్‌టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్ ఇంజినీర్‌గా విధుల్లో చేరిన అతను రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు. వైజాగ్‌లో పని చేస్తున్న సమయంలో అప్పటి తణుకు ఎమ్మెల్యే పీఏ ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం మోసాలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల పీఏలకు ఫోన్లు చేసి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయని, యువతను సిఫార్సు చేయాల్సిందిగా మీమీ ఎమ్మెల్యేలకు సూచించాలంటూ ఎర వేసేవాడు. డిపాజిట్ పేరుతో కొంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. ఈ నేరంపై విజయనగరం టూ టౌన్ పోలీసులు 2009లో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనే వ్యక్తితో ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు.
బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఫోన్ నంబర్లు...
బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఎంక్వైరీ నెం.197 ద్వారా పలువురు ప్రజా ప్రతినిధుల ఫోన్ నంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. రాజీవ్ యువకిరణాలు పేరుతో దాని ప్రాజెక్ట్ డైరెక్టర్‌నంటూ ఎర వేశాడు. వారి పీఏలకు విషయాన్ని ‘వివరించి’ ఒక్కో అభ్యర్థికి రూ.1,060 చొప్పున ముందస్తు డిపాజిట్ చేయాలంటూ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ నేరాలకు సంబంధించి బీజేపీ నాయకుడు రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన బాలాజీ అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్థన్‌లను టార్గెట్ చేశాడు. వారితో పాటు వారి పీఏలకూ ఫోన్లు చేసి రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగుల పేర్లు సూచించాలని కోరాడు. ఒక్కో అభ్యర్థికీ సంబంధించి ముందుగా దరఖాస్తు రుసుము రూ.500, మెస్ చార్జీల కింద రూ.560 కలిపి మొత్తం రూ.1,060 చొప్పున వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుని స్వాహా చేశాడు. హన్మంతరావు రూ.1,09,500, దేవేందర్‌గౌడ్ రూ.66,000, గోవర్థన్ రూ.1,32,00 డిపాజిట్ చేశారు. తానే ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అరెస్టు అయ్యాడు. 2015లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి చిక్కాడు.
కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీని...
హైదరాబాద్ పోలీసులు 2016 జనవరిలో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉండి విడుదలైన బాలాజీ నాయుడు 2017 సెప్టెంబర్ 12న ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఫోన్ చేసి తాను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా ఐదు శాతం చెల్లిస్తే ఆ మెత్తం విడుదల చేయిస్తానంటూ చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఈ కేసులో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో కుంజా సత్యవతికి, ఫిబ్రవరిలో ముఠా గోపాల్‌కు టోకరా వేయడంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి ఈ కేసులను దర్యాప్తు చేశారు. కృష్ణాజిల్లా కంచికచెర్లలోనూ ఇదే తరహా కేసులు నమోదు కావడంతో అరెస్టై జూలైలో విడుదలైన బాలాజీ నాయుడు పుదుచ్చేరికి మకాం మార్చాడు. ముమ్మరంగా గాలించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment