సాక్షి చెన్నై: యువతులను మోసగించేందుకు అతడు ఎంచుకోని మార్గం లేదు. లైంగికవాంఛ తీర్చుకునేందుకు చేయని మోసం లేదు. నగలు, డబ్బులు కాజేసేందుకు ఎత్తని అవతారం లేదు. ఏడు పెళ్లిళ్లు చేసుకుని, మరో 24 మంది యువతులపై లైంగికదాడికి పాల్పడిన ఘరానా మోసగాడిని చెన్నై పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసు కథనం మేరకు.. చెన్నై ఎగ్మూరుకు చెందిన 23 ఏళ్ల యువతి చెన్నై అమైందకరై నెల్సన్‌మాణిక్యం రోడ్డులోని కవిన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ అనే ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ ఏడాది జూన్ 30న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్నేహితులు, బంధువులను విచారించినా సమాచారం లేకపోవడంతో ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను వెతికిపెట్టాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో అడ్వకొనర్వ్ పిటిషన్ వేశారు.
సీసీటీవీ కెమెరాల ద్వారా గాలింపు చర్య ప్రారంభించగా సదరు యువతి పనిచేస్తున్న కంపెనీ యజమాని రాజేష్‌పృథ్వీ (29) జూన్ 30న తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు పాల్పడిన దృశ్యాలు నమోదయ్యాయి. అతడు కూడా కనిపించకుండా పోవడంతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో వెతుకులాట చేపట్టగా తిరుప్పూరు నొచ్చిపాళయం ప్రాంతంలోని ఒక ఇంటిలో బందీగా ఉన్న యువతిని ఇటీవల రక్షించారు. యజమాని రాజేష్‌పృథ్వీ తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, ఇంటిలో బందీగా పెట్టి వేధింపులకు గురిచేశాడని పోలీసుల వద్ద బోరున విలపించింది. ఈనెల 9న ఆ యువతిని కోర్టులో ప్రవేశపెట్టి న్యాయమూర్తి ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి చెన్నై ఎగ్మూరులోని యువతి ఇంటికి వచ్చిన రాజేష్‌పృథ్వీ తన భార్యను అప్పగించాలి్సందిగా తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం తిరుప్పూరు నొచ్చిపాళయం పడమర వీరపాండిలోని ఒక ఇంటిలో ఉన్న నిందితుడిని అదే రోజు రాత్రి అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఎస్‌ఐ యూనిఫాం, నకిలీ ఐడీ, నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ పాన్‌కార్డు, నకిలీ ఓటరు కార్డు, బేడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడి గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
తిరుప్పూరు నొచ్చిపాళయంకు చెందిన రాజేష్‌పృథ్వీ 7వ తరగతి వరకు చదివాడు. ప్రయివేటుగా పదోతరగతి పరీక్షలు రాసాడు. అయితే యువతులను, గృహిణిలను ఆకర్షించడంలో మహాదిట్టయిన అతడు గ్రామంలోని పలువురిని బెదిరించి, ముగ్గులోకి దించి జల్సా చేశాడు. అతడి దురాగతాలకు తల్లిదండ్రులే అడ్డుపడటంతో ఇల్లు వదిలిపారిపోయి ప్రయివేటు కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్నపాటి మోసాలకు పాల్పడేవాడు. మోసాలతో సమకూర్చుకున్న డబ్బుతో జాబ్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. అలాగే అనాథ మహిళా శరణాలయాలను సంప్రదిస్తూ ఇంటిపనులు, కార్యాలయాల్లో పనికి కుదిరిస్తానని మాయమాటలు చెప్పి యువతులతో వాంఛతీర్చుకునేవాడు. పైగా తన కామలీలలను రహస్యంగా వీడియో తీసి డబ్బులు గుంజేవాడు. రాజకీయ వర్గాల్లో పలుకుబడి ఉందని వైద్యసీటు ఇప్పిస్తానని లక్షలు కాజేసి కనిపించకుండా పోయేవాడు. తాను పోలీసుశాఖలో ఎస్‌ఐ అని కొందరికి, వైద్యుడిని, ఇంజినీరునని మరికొందరికి చెప్పుకుంటూ దినేష్ శ్రీరామ్‌గురు, దీనదయాళన్, రాజేష్‌పృథ్వీ తదితర ఏడు పేర్లతో చలామణి అవుతూ ఏడుగురు యువతులను పెళ్లాడాడు. కొన్నినెలలు కాపురం చేసి అత్తింటివారిచి్చన నగలు, సొమ్ముతో కనుమరుగయ్యేవాడు. బాధిత యువతులు తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసు స్టేషన్లలో రాజేష్‌పై ఫిర్యాదు చేసి ఉన్నారు.
2017లో కోయంబత్తూరులో అతడిని అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఆ తరువాత చెన్నైకి చేరుకున్న అతడు నెల్సన్‌మాణిక్యం రోడ్డులో కవిన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ పేరుతో కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీని నమ్మి వచ్చే కొందరు మహిళకు విదేశాల్లో ఉద్యోగాల కోసం శరీర కొలతలు తీసుకోవాల్సి ఉందనే సాకుతో నగ్నంగా మారుస్తూ ‘నీవు చాలా అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుంటా’ అని నమ్మించి వాడుకుంటాడు. ఈ సమయంలో రికార్డు చేసిన నగ్న దృశ్యాలను చూపి బెదిరించి భారీ ఎత్తున సొమ్ముకాజేశాడు. ఇలా ఇతడి చేతుల్లో మోసపోయిన 24 మంది యువతులు సర్వం సమర్పించుకున్నారు. పోలీసులకు, ఇతరులకు చెబితే ఈ దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించడంతో బాధిత యువతులు ఫిర్యాదు చేయలేకపోయారు. ఇలా గత ఐదేళ్లలో ఎంతోమంది యువతుల జీవితాలతో చెలగాటమాడినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 30న అదృశ్యమైన యువతిని ఏడో భార్యగా వివాహమాడగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అతడి బండారం బట్టబయలైంది.. రాజేష్ అరెస్టు సమాచారాన్ని తెలుసుకున్న మెడికల్ సీటు పేరుతో మోసపోయిన 15 మంది బాధితులు పోలీసులను కలుసుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో వీడియోదృశ్యాల ఆధారంగా బాధిత యువతులను పోలీసులు రహస్యంగా పిలిపించుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment