
చనిపోయిన శిశువుతో బంధువులు
నరసరావుపేట టౌన్: పురిటి నొప్పులతో బాధపడుతూ ఏరియా వైద్యశాలకు వచ్చిన ఓ గర్భిణిని గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రసవించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. మాచవరానికి చెందిన పి.అంజలీదేవి పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆదివారం తెల్లవారుజామున బంధువులు పిడుగురాళ్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. అక్కడ çపరిక్షించిన వైద్యులు గర్భంలో బిడ్డ మృతి చెందిందని చెప్పి... బాధితురాలిని నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లమని సూచించారు. డీజిల్ లేకపోవడంతో 108 వాహనం సేవలు నిలిచి పోవడంతో అంజలీదేవిని ఆటోలో పేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు.
అయితే, నరసరావుపేటలో కూడా వాహనం అదే పరిస్థితిలో ఉండి కదలకపోవడంతో పాటు వైద్యశాలలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఆటోలో గుంటూరుకు పయనమయ్యారు. మార్గంమధ్యలో జొన్నలగడ్డ గ్రామ çసమీపానికి చేరగానే ఆటోలోనే మృతి చెందిన శిశువు ప్రసవం జరిగింది. అధిక రక్తస్రావం జరుగుతుండటంతో బాధితురాల్ని తిరిగి ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం అంజలీ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 108 వాహనం అందుబాటులో ఉంటే ప్రథమ చికిత్స అంది బిడ్డ బతికే అవకాశం ఉండేదని రోగి బంధువులు వాపోయారు. సకాలంలో వైద్యం అంది అదృష్టవశాత్తు తల్లి ప్రాణాలైనా నిలుపుకోగలిగామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment