పోలీస్‌స్టేషన్ ఎదుట విద్యార్థుల నిరసన
చీపురుపల్లిరూరల్: అనుకోని పరిస్థితుల్లో పోలీస్ క్వార్టర్స్ ఆవరణలోని తుప్పల్లో మలవిసర్జనకు కూర్చొన్న విద్యార్థిపై పోలీస్‌కానిస్టేబుల్ దౌర్జన్యం చేసి చితకబాదడంతో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులంతా పోలీస్‌స్టేషన్ చుట్టుముట్టి నిరసన తెలిపారు.
బాధితుడు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మేజర్ పంచాయతీ పరిధి వంగపల్లిపేట గ్రామానికి చెందిన వెంపడాపు మధు పట్టణంలో గల శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ విద్యార్థి శుక్రవారం ఉదయం నుంచి విరేచనాలతో బాధపడుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నోట్‌బుక్ కొనుగోలు చేసేందుకు విద్యార్థి కళాశాల నుంచి మార్కెట్‌కు వచ్చాడు. ఆ సమయంలో అత్యవసరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్‌క్వార్టర్స్ ఆవరణంలో గల తుప్పల్లో కూర్చొన్నాడు.
ఈ విషయాన్ని గమనించిన పోలీస్‌కానిస్టేబుల్ నాగరాజు విద్యార్థిని పిలిచి తీవ్ర పదజాలంతో ధూషించి చేతితో మలాన్ని ఎత్తించాడు. అక్కడతో శాంతించకుండా లాఠీతో చితకబాదాడు. విరేచనాలతో ఇబ్బంది పడుతున్నానని, తప్పయిపోయందని విద్యార్థి చెప్పినా.. స్థానికులు అడ్డుపడినా కానిస్టేబుల్ లెక్కచేయలేదు.
విషయం తెలుసుకున్న ఎస్సై కాంతికుమార్, ఏఎస్సై చిన్నారావు వచ్చి కానిస్టేబుల్‌ను మందలించారు. అనంతరం విద్యార్థికి ప్రైవేట్ మెడికల్ క్లినిక్‌లో చికిత్స చేయించి కళాశాలకు పంపించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి పోలీస్‌స్టేషన్‌ను చుట్టిముట్టి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలియజేశారు. ఆరోగ్యం బాగోలేక అత్యవసర పరిస్థితుల్లో మలవిసర్జనకు వెళ్లిన విద్యార్థిని గొడ్డును బాదినట్లు ఎలా బాదారని ప్రశ్నించారు.
కానిస్టేబుల్‌తో క్షమాపణ చెప్పించి అతడిపై కేసు నమోదు చేయాలని ఎస్సై కాంతికుమార్‌ను కోరారు. దీనికి ఎస్సై స్పందిస్తూ అతిగా ప్రవర్థించిన కానిస్టేబుల్‌ను మందలించామన్నారు. ప్రస్తుతం డ్యూటీ నిమిత్తం బొబ్బిలి వెళ్లాడని, వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో విద్యార్థులు, కుటుంబ సభ్యులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment