
వృద్ధురాలి నుంచి డబ్బులు తీసుకుంటున్న సిబ్బంది
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం కొత్తేమి కాదు. రోగిని స్ట్రెచర్‌పై వార్డుకు తీసుకురావడానికి రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తుంటారు. ఇదే ఒక ఎత్తేతే కాసుల వర్షం కురిపించే ప్రసూతి వార్డులో రూ.500కు పైనే వసూలు చేస్తారు.
ఆడబిడ్డ, మగబిడ్డకు ఓ లెక్క చెప్పి మరీ మామూళ్లు తీసుకుంటుంటారు. ఎమర్జెన్సీ వార్డు కింద అంతస్తు నుంచి పైఅంతస్తులోకి రోగిని తీసుకెళ్తే, ఆపరేషన్ అయిన తర్వాత వార్డుకు తరలిస్తే, ప్రసూతి అయిన తర్వాత.. సదరు సిబ్బంది డబ్బులు అడుగుతుంటారు. డెలివరీ కోసం తీసుకొచ్చింది మొదలు బిడ్డ పుట్టి.. వార్డుకు తరలించి.. బట్టలు మార్చే వరకు ఆయా విభాగాల సిబ్బందికి
తప్పకుండా చేయి తడపాల్సిందే.
ప్రసూతి అయినప్పుడు మహిళ సిబ్బంది అక్కడి నుంచి వార్డుకు తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్ సిబ్బంది, మళ్లీ బట్టలు మార్చాలంటే మహిళ సిబ్బంది.. ఇలా ఆ వార్డులో కాసుల కక్కుర్తితో రిమ్స్‌కు వచ్చే పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
ఒకవేళ డబ్బులు లేవంటే వారిపై కస్సుబుస్సు మనడం పరిపాటిగా మారింది. దూరప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి నిరుపేదలు ఆస్పత్రికి వస్తుంటే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని పలువురు పేర్కొంటున్నారు.
మారని సిబ్బంది తీరు..
గతంలో పలుమార్లు వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదు. రిమ్స్‌లోని పలు వార్డుల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఎవరైన డబ్బులు అడిగితే తమ కు సమాచారం ఇవ్వండని అధికారులు సైతం బోర్డులు పెడుతున్నారు. అయినా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు.
గతంలో రాష్ట్ర మంత్రి జోగు రామన్న రిమ్స్‌లో ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో కొంత మంది మహిళలు ప్ర సూతి వార్డులో డబ్బులు తీసుకుంటున్నారని మం త్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే డ బ్బులు తీసుకున్న వారి గురించి చెబితే మళ్లీ వార్డుకు వచ్చి తమను బెదిరిస్తారనే భయంతో సదరు రోగులు చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నారు.
గుర్తించిన తర్వాత చర్యలు
సిబ్బంది డబ్బులు వసూలు చేసిన సమాచారం అందింది. అయితే డబ్బులు తీసుకున్నది ఎవరనేది గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. వార్డుల్లో సిబ్బంది డబ్బులు ఇవ్వమని అడిగితే తమకు సమాచారం అందించాలి. – అశోక్‌కుమార్, రిమ్స్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment