
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు విచారణకు భయపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఎస్‌ఐని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబసభ్యులు రోడ్డుపై భైఠాయించారు. మృతదేహాలను రోడ్డుపై ఉంచి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. వీరికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోడ్డుపై కూర్చుని మద్దతు తెలిపారు.
అసలేం జరిగింది: మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన కిరణ్ విజయవాడలో జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ కిరణ్‌పై ఓ యువకుడు కొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం ఉదయం కిరణ్‌ను విచారించారు. దీంతో భయాందోళనకు లోనైన కిరణ్ బుధవారం అర్థరాత్రి భార్య హెలీనాతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అధికారులు స్పందించకపోవటం దురదృష్టకరం: ఎమ్మెల్యే ఆర్కే
బాధితులు రోడ్డుపైకి వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నా.. ఇబ్రహీంపట్నం, విజయవాడకు చెందిన ఒక్క అధికారి కూడా స్పందించకపోవటం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. లోకల్ పోలీసులు వచ్చినప్పటికి ఎస్పీ గానీ కలెక్టర్ గానీ సంఘటనపై స్పందించకపోవటం బాధకలిగిస్తోందన్నారు. ప్రభుత్వ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల డిమాండ్ మేరకు ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ, సీఐలను సస్పెండ్ చేయాలన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్న మిగిలిన నలుగురిని తక్షణమే అరెస్ట్ చేసి వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment