చెన్నై : నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి హాజరుపరచాల్సిందిగా దురైయూర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌పై పలు మోసపు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. పలు మార్లు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా తిరుచ్చి జిల్లా, దురైయూర్‌కు చెందిన వరదరాజన్ అనే వ్యక్తికి పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానని చెప్పి కమీషన్‌గా అతని వద్ద రూ.30 లక్షలు తీసుకున్నాడు.
అయితే ఆ తరువాత వరదరాజన్‌కు శ్రీనివాసన్ ఎలాంటి రుణం ఇప్పించలేదు. దీంతో వరదరాజన్ తాను ఇచ్చిన రూ.30 లక్షలు తిరిగి ఇవ్వవలసిందిగా అడగడంతో రెండేళ్ల క్రితం అతనికి శ్రీనివాసన్ చెక్కు ఇచ్చాడు. అది బ్యాంక్‌లో బౌన్స్ అవ్వడంతో తాను మోసపోయానని భావించిన వరదరాజన్ దురైయూర్ నేర విభాగ శాఖ కోర్టులో శ్రీనివాసన్‌పై పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు పలు సార్లు విచారణకు వచ్చినా శ్రీనివాసన్ కోర్టుకు హాజరు కాలేదు. మరోసారి గురువారం న్యాయమూర్తి వడివేలు సమక్షంలో విచారణకు వచ్చింది. మళ్లీ శ్రీనివాసన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి... శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment