ఆన్‌లైన్‌ మోసాలకు కళ్లెం! | Curb online fraud | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మోసాలకు కళ్లెం!

Published Tue, May 15 2018 2:09 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Curb online fraud - Sakshi

విజయనగరం పూల్‌బాగ్‌ : జిల్లాలో ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విస్తృతమైంది. దుకాణాలకెళ్లి వెదకడం ఇష్టలేక కొందరు... ఆన్‌లైన్‌లో అందంగా చూపించే బొమ్మలకు ఆకర్షితులైన కొందరు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించి ఆర్డర్లు ఇవ్వడం ఎక్కువైంది. ఇదే అదనుగా కొన్ని ఆన్‌లైన్‌ కంపెనీలు వినియోగదారులను మోసగిస్తున్నాయి.

వారు ఆర్డర్‌ ఇచ్చిన సరకు స్థానంలో వేరే ఏవో వస్తువులను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతలను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. 

ఈ-మార్కెట్‌పై నిఘా

వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ-మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని తూనికల కొలతలశాఖకు అప్పగించింది. ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతో పాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంప్రదించాల్సి చిరునామా, కస్టమర్‌ కేర్‌ ఫోన్‌ నంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొలుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొనడంతో ఈ దిశగా మార్పులు ప్రారంభమయ్యాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 70 నుంచి 80 శాతంమంది సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. వీరిలో 40శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్‌ఫోన్లు, కొత్తకొత్త మోడళ్లకోసం నిత్యం సెర్చ్‌ చేస్తున్నారు. ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాఫ్, ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. వాటికి ఆకర్షితులై ఆన్‌లైన్‌లో వస్తువులు బుక్‌చేస్తే వారే బుక్‌అయిపోతున్నారు.∙


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement