సొరంగంలో దూసుకొచ్చిన మృత్యువు | DCM Hits Students At Ranganayaka Sagar Project | Sakshi
Sakshi News home page

సొరంగంలో దూసుకొచ్చిన మృత్యువు

Published Fri, Mar 1 2019 8:44 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

DCM Hits Students At Ranganayaka Sagar Project - Sakshi

విద్యార్థిని నాగలక్ష్మి (ఫైల్‌), కార్మికుడు అక్రం మృతదేహం

సాక్షి, సిద్దిపేట: రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ప్రాజెక్టు సొరంగ మార్గంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ పాలిటెక్నిక్‌ విద్యార్థిని, ప్రాజెక్టులో పనిచేస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది విద్యార్థులు, 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్‌ మూడవ సంవత్సరం చదువుతున్న 73 మంది విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ నిమిత్తం గురువారం కళాశాల నుంచి రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తవ్విన సొరంగ మార్గం గుండా సంప్, పంప్‌హౌస్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ఇంజనీర్లనుంచి వివరాలు తెలుసుకుని సొరంగం నుంచి పైకి వచ్చేందుకు విద్యార్థులు వాహనం వద్దకు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలోనే టన్నెల్‌లో పనిచేస్తున్న కార్మికులను మధ్యాహ్న భోజనం కోసం పైకి తీసుకొచ్చేందుకు డీసీఎం వాహనం తీసుకొచ్చారు.

అయితే నిలిపి ఉన్న ఈ వాహనం టైర్ల కింద సపోర్టు కోసం ఎలాంటి రాయి పెట్టలేదు. దీంతో కూలీలు డీసీఎం ఎక్కుతుండగా.. అప్పుడే అటు నుంచి నడుచుకుంటూ వస్తున్న విద్యార్థులపైకి డీసీఎం దూసుకెళ్లగా పలువురు విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ  సంఘటనలో సిద్దిపేట పట్టణానికి చెందిన నాగలక్ష్మి(18), కశ్మీర్‌లోని జోడా గ్రామానికి చెందిన మహ్మద్‌ అక్రం (25) డీసీఎం కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది విద్యార్థులకు, ఎనిమిది మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో అక్కన్నపేటకు చెందిన అనూహ్య(18) వెన్నెముకకు దెబ్బతగలడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్‌ తరలించారు. అదేవిధంగా చర్ల వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన ఉమారాణి (19) కాలు విరిగింది. దుబ్బాక మండలం దివ్య(18), వెల్దుర్తి మండలం చార్లపల్లికి చెందిన జి.దివ్య(18), ముస్తాబాద్‌కు చెందిన స్రవంతి(18), దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన నవ్య(18), బస్వాపూర్‌కు చెందిన తేజ(19), భార్గవి(18), హుస్నాబాద్‌ మండలం గండిపల్లికి చెందిన మానస(18), గజ్వేల్‌కు చెందిన లావణ్య(19), కొండపాకకు చెందిన శ్రావణి(18), సంపూర్ణ(18), కానుగల్లుకు చెందిన వెంకటలక్ష్మీ(18), అదేవిధంగా అఖిల(18), రమ్య(19), శ్రావణి(18)లకు గాయాలు కాగా సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

నేనూ చచ్చిపోతా... 
‘నాకు చిట్టి (నాగలక్ష్మి) అంటే ప్రాణం. నాన్న చనిపోయాడు.. వద్దు బిడ్డా ఇంటి వద్దే ఉండూ అన్నా.. వినకుండా కాలేజీకి పోయింది. ఇప్పుడు శవంలా వచ్చింది. నేను ఎవరికోసం బతకాలి, నా చిట్టి నాకు కావాలి లేకుంటే నేనూ చచ్చిపోతా’ అంటూ ఆçస్పత్రిలో మృతురాలి తల్లి సుజాత రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది.  

తండ్రి చనిపోయిన పదిరోజులకే.. 
సిద్దిపేటజోన్‌: పది రోజుల క్రితమే నాగలక్ష్మి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు లేకపోవడంతో ఉన్న ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురుగా తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. బుధవారం తండ్రి దశదిన కర్మను దగ్గరుండి చేపట్టింది. ఇంతలోనే విధి మళ్లీ ఆ కుటుంబంపై పగ పట్టింది.  పదిరోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో రెండు చావులు చోటుచేసుకోవడంతో నాగలక్ష్మి తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.  

హరీశ్‌రావు పరామర్శ 
ప్రమాద విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆసుపత్రికి వచ్చి బాధి తులను పరామర్శించారు.  గాయాలైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలు నాగలక్ష్మి తల్లి సుజాతను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చా రు. తక్షణ సాయంగా రూ. లక్ష అందజేశారు. వెన్నెముకకు దెబ్బతలిగిన అనూహ్య తల్లిదండ్రులకు రూ.50 వేలు అందజేశారు. ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయిస్తామని చెప్పారు. గాయపడిన విద్యార్థులకు తక్షణసాయంగా రూ.10 వేలు చొప్పున అందజేస్తామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement