లక్నో: ఉచితంగా పాన్ ఇచ్చేందుకు నిరాకరించిన దుకాణ యజమాని చెవి, పెదవి కొరికేశాడో యువకుడు. లక్నోలోని అలంబాగ్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో పాన్ ఫ్రీగా ఇవ్వమని అడగగా.. ఇవ్వనని పాన్ షాపు యజమాని చెప్పడంతో ఈ గొడవ జరిగింది. వెంటనే గాయపడిన పాన్ షాపు యజమానిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివరాల్లోకెళ్తే.. శాలు(28) అనే ఓ వీడియో గ్రాఫర్ మంగళవారం రాత్రి పాన్ తీసుకునేందుకు ఓ షాపు వద్దకు వెళ్లాడు.
అప్పటికే ఆలస్యమవడంతో పాన్ షాప్ యాజమాని సత్యేంద్ర దుకాణాన్ని మూసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శాలు తనకు ఫ్రీ గా కిళ్లీ ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. కుదరదని షాపు యజమాని సత్యేంద్ర చెప్పడంతో కోపంతో వెంటనే పక్కనే ఉన్న రాయితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా యజమాని ఎడమ చెవి, కింది పెదవిని కొరకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన సత్యేంద్రను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment