దారుణం: మాయమాటలు చెప్పి ఇంటికి రమ్మని.. | Dishonour Killing Family Hacked Woman In Haryana | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో..

Published Mon, Sep 9 2019 10:41 AM | Last Updated on Mon, Sep 9 2019 10:46 AM

Dishonour Killing Family Hacked Woman In Haryana - Sakshi

చండీగఢ్‌ : కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు ఆమె కుటుంబసభ్యులు. మాయమాటలు చెప్పి నమ్మించి ఇంటి వద్దకు రాగానే తలనరికి పాశవికంగా చంపేశారు. ఈ సంఘటన హర్యానాలోని సోనీపత్‌ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  సోనీపత్‌కు దగ్గరలోని గోహన గ్రామానికి చెందిన రీతు అనే యువతి కుటుంబసభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా రెండు నెలల క్రితం అర్జున్‌ అనే వ్యక్తిని  కులాంతర వివాహం చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అయినప్పటికి తన సోదరి అంజలితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో శనివారం ఆరోగ్యం బాగాలేదని రీతు తన సోదరికి తెలిపింది. దీంతో అంజలి.. రీతును సోనీపత్‌లోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవటానికి రావాలని కోరింది. రీతు భర్త అర్జున్‌తో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అక్కడికి అంజలితో పాటు రీతు తల్లి, సోదరుడు కూడా వచ్చారు.

అందరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం ఇంటివద్ద ఉన్న మిగిలిన కుటుంబసభ్యులను కలుసుకోవటానికి రావాలని వారు రీతును బ్రతిమాలారు. తల్లి, సోదరుడు అంతలా అడిగేసరికి ఆమె కాదనలేకపోయింది. వారివెంట పుట్టింటికి నడిచింది. అయితే భర్త అర్జున్‌ మాత్రం తాను ఇంట్లోకి రానని చెప్పి బయటే దూరంగా ఉండిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన రీతును ఆమె కుటుంబసభ్యులు దారుణంగా  తల నరికి హత్య చేశారు. తదనంతరం అర్జున్‌ను కూడా వెంటపడి చంపటానికి ప్రయత్నించారు. వారి దాడినుంచి తప్పించుకున్న అర్జున్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ రీతు మృతదేహాన్ని గుర్తించారు. మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న హతురాలి కుటుంబసభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement