జీరో సైజ్‌ మోజు భార్య.. కోర్టుకెక్కిన భర్త..! | Divorce for conflicts couples with in one month | Sakshi
Sakshi News home page

కలహాల జంటకు  నెలకే విడాకులు

Published Tue, Dec 5 2017 11:23 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

Divorce for conflicts couples with in one month - Sakshi

సాక్షి, బెంగళూరు: జీరోసైజ్, స్లిమ్‌ ఫిట్‌లపై వ్యామోహం కొత్త దంపతుల మధ్య విడాకులకు దారి తీసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ భర్త అర్జీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరంలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న వ్యక్తికి నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఆమె కొద్దిగా లావుగా ఉండడంతో మొదట యువకుడు వివాహానికి అంగీకరించలేదు. అయితే అతని తల్లి ఒత్తిడితో కాదనలేక సుమారు నెలకిందట ఆ యువతికి మూడుముళ్లు వేశాడు. 

లావుగా ఉన్న తాను నాజూగ్గా మారాలనే తాపత్రయంతో చాలాకాలంగా డైట్‌ చేస్తున్న యువతి అత్తవారింట్లోనూ అనుసరించేది. కేవలం ఆకు కూరలు, పచ్చి కూరగాయలు మాత్రమే తీసుకునేది. తనతో పాటు భర్తకు, అత్తకు కూడా వాటినే ఆహారంగా తీసుకోవాలంటూ కొత్త కోడలు ఒత్తిడి చేసేది. ఇవి తమకు పడవని తమ కోసం ప్రత్యేకంగా వంట చేయాలంటూ భర్త చెప్పేవాడు. యువతి మాత్రం ఇవే తినాలంటూ ఇరువురిని బలవంతపెట్టేది, వినకపోతే భర్త, అత్తను ఇష్టమొచ్చినట్లు కొట్టేది. ఇదే క్రమంలో ఒకసారి అత్తపై దాడికి పాల్పడగా ఆమె చెయ్యి కూడా విరిగింది. ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ భర్తతో గొడవ పడుతుండేవారు. వేరు కాపురం పెట్టాలని పోరుపెట్టేది, దీనికి భర్త ససేమిరా అనేవాడు. 

తట్టుకోలేనంటూ.. కోర్టుకెక్కిన భర్త 
భార్య వేధింపులు శృతి మించాయంటూ ఆ భర్త విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యాడు. అందులో భాగంగా న్యాయవాది చేతన్‌ పటేల్‌ను కలిసి విషయాన్ని తెలిపారు. అయితే వివాహం జరిగి నెల రోజులు మాత్రమే కావడంతో విడాకులకు నిబంధనలు ఒప్పుకోవని న్యాయవాది తేల్చిచెప్పారు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి బలవంతం మేర వివాహం చేసుకోవాల్సి వచ్చిందని, మరుసటి రోజు నుంచే భార్య వేధింపులు మొదలయ్యాని భర్త ఆ వకీల్‌కు మొరపెట్టుకున్నాడు.

ఆ అంశాల ప్రకారం భార్య, భర్తకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు భార్య అభిప్రాయాన్ని కోరగా తమకు కూడా ఈ వివాహం ఇష్టం లేదని తల్లితండ్రులు బలవంతం మేరకే వివాహానికి అంగీకరించినట్లు తెలిపారు.దీంతో ఇరువురి సమ్మతం మేరకు కుటుంబ న్యాయస్థానం కలహాల దంపతులకు విడాకులు మంజూరు చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement