వికారాబాద్ అర్బన్ : వాహనం ఉన్న ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్సు ఉండాల్సిందేనని ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం వికారాబాద్ డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో వికారాబాద్ డివిజన్ పరిధిలోని మండల కేంద్రాల్లో ఏకకాలంలో వాహనాలు తనిఖీలు చేశారు. స్థానిక మహాశక్తి చౌరస్తాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడారు. ప్రతి వాహనదారుడు విధిగా లైసెన్సు, ఇతర పత్రాలు కలిగి ఉండాలని చెప్పారు.
లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిగా డ్రైవింగ్ రాకపోయినా నడిపితే మనతో పాటు, ఇతరులకు ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలతో చెలాగాటం ఆడొద్దని సూచించారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతిఒక్కరూ పాటించాలని తెలిపారు.
ప్రమాదాలను నివారించేందుకే వాహనాల తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. వాహనానికి సంబంధించి పత్రాలు లేకపోతే ఈ–పిట్టీ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వాహనదారులకు జరిమానా వేసి రశీదు ఇచ్చేవారమని, ఇప్పుడు ఈ పిటీ కేసు నమోదు చేయడంతో నేరుగా ఆన్‌లైన్‌లో కేసు నమోదవుతుందని వివరించారు. వాహనదారుడు మీ సేవా, లేదా ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లించి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, అతివేగం ప్రాణాంతకం అన్నారు.
వికారాబాద్ డివిజన్ పరిధిలో వాహనాల తనిఖీని డీఎస్పీ శిరీష ఆద్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. అనంతరం డీఎస్పీ శిరీష మాట్లాడుతూ.. మంగళవారం డివిజన్ పరిధిలో 70 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ సీఐ వెంకట్ రామయ్య, ఎస్‌ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment