సాక్షి, చెన్నై: నేటి ఆధునిక యుగంలో జరుగుతున్న ఆటవిక సాంప్రదాయాన్ని ఓ వెబ్‌సైట్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆలయంలో బాలికలను అర్ధనగ్నంగా తిప్పే మూఢనమ్మకానికి సంబంధించిన ఓ సంచలన వీడియోని పోస్టు చేసింది. దీంతో స్పందించిన అధికారులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆ ఆలయ పూజారి, ఆయన అనుచరులకు కోపం వచ్చింది. ఈ వీడియోను తన వెబ్‌సైట్‌లో పోస్టుచేసిన జర్నలిస్టును చంపేస్తామంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగారు.
వివారాల్లోకి వెళ్తే తమిళనాడు, మదురై జిల్లాలోని వెల్లూర్ గ్రామంలోని ఆటవిక సంప్రదాయం నడుస్తోంది. గ్రామంలోని యజైకథా అమ్మన్ ఆలయంలో తమిళ నెల ఆవానీ ప్రారంభ రోజున బాలికలు ఒకరోజు రాత్రి దేవుడి ఆలయంలో గడపాలి. ఇందుకోసం పది నుంచి పద్నాలుగేళ్ల వయసున్న ఏడుగురు అమ్మాయిలను ఆలయ పూజారి ఎంపిక చేస్తారు. అనంతరం వారిని అర్థనగ్నంగా శరీర పైభాగంపై పూలు, ఆభరణాలు మాత్రమే ధరింపజేసి ఒకరోజు రాత్రంతా వారితోపాటు పూజారి ఆలయంలో గడుపుతారు.
ఈ తంతు కోసం గత మంగళవారం నుంచి గ్రామంలో ఆలయ పూజారి, ఆయన అనుచరులు బాలికలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. దీంతో గ్రామంలోని 62మంది బాలికలు భయంతో పారిపోయారు. ఈ సంఘటనపై విద్యాశ్రీ ధర్మరాజ్ అనే సంపాదకురాలు తన వెబ్‌సైట్ 'కోవైపోస్టు'లో వీడియోతో పాటు ప్రత్యేక కథనం ఇచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది.
దీంతో రెచ్చిపోయిన పూజారి, ఆయన అనుచరులు.. చంపేస్తామంటూ విద్యాశ్రీను ఫోన్‌లో బెదిరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్తను పోస్టు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపు ఫోన్‌లు వస్తున్నాయని, వాటిని భరించలేక ఫోన్ స్విచ్చాఫ్ చేశానని ఆమె తెలిపారు. బెదిరించిన ఫోన్ నెంబర్ల జాబితాను పోలీసులకు అందించినట్లు చెప్పారు.