
సాక్షి, గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు.. దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేంద్రరనగర్ నాలుగో లైన్‌లో నివాసం ఉంటున్న బొప్పన సాయిచౌదరి (72), నాగమణి (67) ఇంట్లోకి దుండగులు చొరబడి వారిని తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకు వెళ్లారు. అంతేకాకుండా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా దుండగులు అపహరించుకు వెళ్లారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి హాల్‌లో రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టంకు తరలించారు. మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఈ హత్యకు పాల్పడింది దోపిడీ దొంగలా లేక ఇరతర్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపడంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.