ఏనుగులు విడిపోవడంవల్లే... | Elephants Attack in Vizianagaram | Sakshi
Sakshi News home page

మళ్లీ గజగజ...

Published Sat, Dec 7 2019 12:34 PM | Last Updated on Sat, Dec 7 2019 12:34 PM

Elephants Attack in Vizianagaram - Sakshi

మృతురాలి కుమారుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై శివప్రసాద్, రేంజర్‌ మురళీకృష్ణ

జియ్యమ్మవలస: ఒకటికాదు... రెండు కాదు... దాదాపు 16 నెలలుగా ఏనుగుల బెడద తప్పడం లేదు. ఏజెన్సీని వదిలి మైదాన ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ భయోత్సాతాన్ని సృష్టిస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. గతంలో దాడులతో గాయాలపాలైన వ్యక్తుల ఉదంతాలు చోటు చేసుకోగా తాజాగా ఓ మహిళ ఏనుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలో మరింతఆందోళన నెలకొంది. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామం వద్ద ఏనుగుల దాడితో గంట చిన్నమ్మి(55) అక్కడకక్కడే మృతిచెందింది. శుక్రవారం సాయంత్రం గిజబ నుంచి స్వగ్రామం బాసంగికి వస్తూ ఊరికి సమీపంలోనే ఏనుగుదాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలతోపాటు ఆందోళన కూడా నెలకొంది.

స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఏనుగులు బాసంగి పొలిమేరలో ఉండడంతో అటవీశాఖ సిబ్బంది గ్రామంలోనే ఉన్నారు. అటుగా వస్తున్న చిన్నమ్మికి ఏనుగులు ఉన్నాయని ఓ వైపు కేకలు వేశారు. అయితే రోడ్డుపక్కకు చేరిన ఆమెను ఒక ఏనుగు తొండంతో లాక్కొని పత్తి చేనులోకి లాక్కొని పోయి కాలితో నుజ్జునుజ్జు చేసింది. చిన్నమ్మి పేగులు బయటకు రాగా కాలుచేతులు విరిగిపోవడంతో అక్కడకక్కడే మృతిచెందిందని తెలిపారు. చిన్నమ్మికి శ్రీనివాసరావు, గౌరునాయుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారని వారికి పెళ్లిళ్లు అయిపోగా ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. పాపకు కూడా పెళ్లి అయిందని తెలిపారు. భర్త అప్పలస్వామినాయుడుతో జీవనం సాగిస్తుండగా వీరికి కుమారులే సాయం చేస్తుంటారు. చిన్నమ్మి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలము కున్నాయి. సంఘటనా స్థలానికి కురుపాం రేంజర్‌ మురళీకృష్ణ, చినమేరంగి ఎస్సై శివప్రసాద్, డిప్యూటీ తహసీల్థార్‌ రాధాకృష్ణ వచ్చి మృతురాలి కుటుంబాల నుండి వివరాలు సేకరించారు.

ఏనుగులు విడిపోవడంవల్లే...
గతంలో 6 ఏనుగులు కలసి ఉండేవని, ఇప్పుడు నాలుగు ఏనుగులు ఓ వైపు ఉన్నాయని, మిగిలిన రెండు వేరే చోట తిరుగుతున్నాయని కురుపాం ఫారెస్ట్‌ రేంజర్‌ మురళీకృష్ణ తెలిపారు. ఏనుగులు ఒకచోటకు చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నాడు పంట నష్టం–నేడు ప్రాణ నష్టం
మండలంలో 16 నెలల నుంచి ఏనుగులు సంచరిస్తున్నా ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు ఏదో సర్దుకుపోతున్నారు. పంటను నాశనం చేసి వెళ్లిపోయేవనీ, తమకూ అటవీశాఖ పరిహారం అందజేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ పంటలకే పరిమితమైన ఇవి ఇప్పుడు మనుషుల ప్రాణాలమీదకు రావడంతో భయాందోళనలు నెలకొన్నారు. రాత్రి సమయాన ఎటువెళతాయో తెలియడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏనుగులను శాశ్వతంగా తరలించాలని కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement