
బాధిత యువతి ,అరెస్ట్ అయిన కానిస్టేబుల్ జితేంద్ర శెట్టి
భువనేశ్వర్/పూరీ: పూరీ జిల్లాలో ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో మాజీ పోలీసు కానిస్టేబుల్ జితేంద్ర శెట్టిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌తో పాటు మరో నిందితుడిని కూడా అరెస్టు చేసినట్లు సెంట్రల్ రేంజ్ డీఐజీ అశిష్ సింగ్ తెలిపారు. పూరీ పట్టణం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం యువతిపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు నిందితుల్ని కోర్టులో హాజరుపరుస్తారు. రానున్న 20 రోజుల్లో నిందితులకు వ్యతిరేకంగా నేరారోపణ చిట్టా ఖరారు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతిని అభ్యర్థిస్తామని అశిష్ సింగ్ మీడియాకు వివరించారు. బాధిత యువతి పట్ల అవాంఛనీయ ప్రచారం నివారించి నైతిక విలువలకు పట్టం గట్టాలని ఆయన అన్ని వర్గాలను అభ్యర్థించారు. బాధిత యువతికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలం నమోదు చేశారు.
మాజీ కానిస్టేబుల్ దగ్గర ఐడీ కార్డు
ఈ విచారకర సంఘటనలో ప్రధాన నిందితుడు జితేంద్ర శెట్టిని లోగడే విధుల నుంచి బహిష్కరించినట్లు సెంట్రల్ రేంజ్ డీఐజీ అశిష్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో పాత గుర్తింపు కార్డు ఆయన ఆధీనంలో ఎలా ఉందనే కోణంలో విచారణ సమాంతరంగా చేపట్టనున్నట్లు తెలిపారు. 2016 వ సంవత్సరంలో జితేంద్ర శెట్టిని పోలీసుసేవల నుంచి బహిష్కరించారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా వేర్వేరు కేసుల్ని నమోదు చేశారు. బస్సు కోసం నిరీక్షిస్తున్న యువతిని నలుగురు దుండగులు మోసగించి తీసుకుపోయి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కుంభార్‌పడా పోలీసు స్టేషన్‌లో బాధిత యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించింది.
కాకత్‌పూర్ వెళ్లేందుకు నిమాపడా ప్రాంతంలో బస్సు కోసం వేచి ఉండగా లిఫ్టు ఇస్తామని యువతిని మభ్య పెట్టి లోబరుచుకుని వాహనంలో తీసుకుపోయారు. ఈ కథ వెనుక నలుగురు దుండగులకు మాజీ పోలీసు కానిస్టేబుల్ సారథ్యం వహించాడు. ఝాడేశ్వరి ఆలయం వెనుక ప్రభుత్వ క్వార్టర్‌లో ఈ నలుగురు నిందితులు యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు కుంభార్‌పడా స్టేణ్‌లో ఫిర్యాదు దాఖలైంది. బాధిత యువతి చేతికి చిక్కిన పర్సు నుంచి నిందిత మాజీ కానిస్టేబుల్ జితేంద్ర శెట్టి గుర్తింపు కార్డు లభించింది. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసి కుంభార్‌పడా స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
దర్యాప్తు కోసం నాలుగు బృందాలు: డీజీపీ
భువనేశ్వర్: పూరీ జిల్లాలో సంభవించిన సామూహిక లైంగిక దాడి కేసులో నిందితులకు కోర్టు కఠిన శిక్ష ఖరారు చేసేలా ఆధారాలు సేకరిస్తున్నట్టు తాత్కాలిక డీజీపీ సత్యజిత్ మహంతి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణ, దర్యాప్తు కోసం నాలుగు వేర్వేరు బృందాల్ని పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇందులో రెండు బృందాలు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల గాలింపులో తలమునకలై ఉన్నాయి. మిగిలిన రెండు దర్యాప్తు బృందాలు పకడ్బందీగా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సత్యజిత్ మహంతి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment