
రజిత మృతదేహం
కీసర: వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. కీసర సీఐ ప్రకాష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, రాజంపేట మండలం, పాముకుంటకు చెందిన రజిత(23)కు అదే మండలం, గంధమల ఇందిరానగర్‌కు చెందిన రాగాల మహేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం వారు రెండేళ్ల క్రితం నాగారం వలస వచ్చారు. మహేష్ మేస్త్రీగా పని చేస్తున్నాడు.
గతంలో పలుమారు భార్యభర్తల మధ్య అదనపు కట్నం విషయమై గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం దంపతులిద్దరు పనికి వెళ్లగా మధ్యాహ్నం రజిత కడుపునొప్పిగా ఉందని ఇంటికి తిరిగివచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మహేష్ రజిత ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించి కీసర పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా తమ కుమార్తెను గత కొంత కాలంగా భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని రజిత తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment