
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించడానికి అనువుగా పాత తేదీలతో కూడిన నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సంగ్రహించి, విక్రయిస్తున్న వ్యవస్థీకృత ముఠాకు తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. వివరాల్లోకి వెళితే..స్టాంపు వెండర్లు అయిన అల్వాల్, న్యూ బోయగూడ ప్రాంతాలకు చెందిన క్రాంతి సురేష్ కుమార్, మహ్మద్ అలీ సికింద్రాబాద్ కోర్టు వద్ద నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు విక్రయిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో తృప్తి చెందని వీరు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, పాత తేదీలతో ఉన్న నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు విక్రయించడం మొదలెట్టారు. పాతబస్తీకి చెందిన సతీష్ నుంచి పాత స్టాంప్ పేపర్లు సంగ్రహిస్తున్న క్రాంతి వాటిని అలీ ద్వారా విక్రయించేవాడు. ఇలా వీరు విక్రయించిన పత్రాలను వినియోగించి కొందరు వివాదాస్పద స్థలాలను కబ్జా చేయడం చేస్తుండగా, రియల్ ఎస్టేట్ దళారులు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు స్వామి వలపన్ని ఆదివారం క్రాంతి, అలీలను అరెస్టు చేశారు. 228 ఖాళీగా ఉన్న పాత స్టాంప్ పేపర్లు, 105 ఖాళీ కొత్త నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు, 104 నకిలీ రబ్బర్ స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్ కోసం గాలిస్తున్నారు. నిందితులను గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment