తన్వీర్ హుస్సేన్ రజ్వీ
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు తన్వీర్ రజ్వీ... చదివింది పదో తరగతి... టర్నర్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం సూడో పోలీసుగా మారాడు... టాస్క్‌ఫోర్స్/సీసీఎస్/లా అండ్ ఆర్డర్‌లో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు... పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని, వేలం వేసే వాహనాలు తక్కువ ధరకు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు... దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో అరెస్టు చేశారు. ఇతను చివరకు తన కుటుంబాన్ని సైతం పోలీసుననే చెప్పుకుని మోసం చేశాడు. అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడి..
హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన సయ్యద్ తన్వీర్ హుస్సేన్ రజ్వీ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఓ కార్ఖానాలో కొన్నాళ్ల పాటు టర్నర్‌గా పని చేశాడు. ఇతడికి ఐదురుగు సంతానం. టర్నర్‌గా వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణే కష్టంగా మారింది. దీనికి తోడు తన్వీర్ విలాసాలకు అలవాటు పడటంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో డ్రైవర్‌గా, సెక్యూరిటీ గార్డుగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2014లో హోంగార్డుగా (డ్రైవర్) దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో మళ్లీ తన పనులు మొదలెట్టాడు. అయితే భార్య, పిల్లలతో మాత్రం తాను హోంగార్డుగా పని చేస్తున్నట్లు నమ్మించేవాడు. ఇందుకుగాను ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సఫారీ డ్రస్ ధరిస్తుండేవాడు. ఇతడి పర్సనాలిటీ సైతం పోలీసు మాదిరిగానే ఉండటంతో అంతా తేలిగ్గా నమ్మేశారు.
వాకీటాకీ, మొబైల్ యాప్‌లు వాడి...
సూడో పోలీసుగా తిరుగుతున్న తన్వీర్ తాను నగర టాస్క్‌ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్–ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) అని కొందరితో, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారినని మరికొందరితో, సెంట్రల్ జోన్ డీసీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌గా మరికొందరితో చెప్పుకున్నాడు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించేందుకుగాను స్నాప్‌డీల్ యాప్ నుంచి ఓ డమ్మీ వాకీటాకీ (వైర్‌లెస్ సెట్) ఖరీదు చేసుకున్నాడు. ఇది డమ్మీది కావడంతో పోలీసు వాకీటాకీలో వచ్చే శబ్ధాలు, మాటలు, సైరన్ మోతల కోసం ‘స్మార్ట్’గా ఆలోచించిన అతను గూగుల్ ప్లేస్టోర్స్ నుంచి ‘పోలీసు రేడియో యాప్’ను తన స్మార్ట్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ వాకీటాకీని బయటకు తీసిన ప్రతిసారీ ఎవరూ గమనించకుండా ఈ యాప్‌ను ఆన్ చేసేవాడు. దీంతో ఎదుటి వారికి అది పోలీసులు వాడే వైర్‌లెస్ సెట్టే అని భ్రమ కలిగేది. ఇలా పోలీసునంటూ చెప్పుకుని తిరిగే తన్వీర్ ఓ దశలో మోసాలు చేయడం ప్రారంభించాడు. అతను గతంలో సెక్యూరిటీ గార్డుగానూ పని చేసి ఉండటంతో పోలీసుల హావభావాలు, పని తీరుపై పట్టు ఉంది. దీనిని ఆధారంగా చేసుకునే మోసాలకు పాల్పడ్డాడు.
ఉద్యోగాలు, వేలం పేరుతో...
ఐదేళ్ల క్రితం హోంగార్డు పోస్టుకు దరఖాస్తు చేసి, ఎంపిక కాకుండా భంగపడిన తన్వీర్ ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. కొందరికి కానిస్టేబుల్ పోస్టులంటూ ఎర వేశాడు. పోలీసు విభాగం బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించే వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ పలువురిని ఆకర్షించాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష–రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు. దీంతో ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి. తన్వీర్ కొన్ని సందర్భాల్లో తాను ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ అని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో వలపన్నారు. బుధవారం నిందితుడు తన్వీర్‌ను పట్టుకుని అతడి నుంచి పోలీసు, జర్నలిస్ట్, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పేర్లతో ఉన్న నాలుగు నకిలీ గుర్తింపు కార్డులు, డమ్మీ వాకీటాకీ, సెల్‌ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమత్తం నిందితుడిని హుస్సేనిఆలం పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment