
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ దామోదర్ ,సృజన కుమార్ అలియాస్ చరణ్
విశాఖ క్రైం, పీఎం పాలెం(భీమిలి): రోడ్డు పక్కన మద్యం తాగేవారు... అబ్బాయిలతో కలిసి ఉండే అమ్మాయిలు... రాత్రి వేళ ఒంటరిగా కనిపించే వారినే లక్ష్యంగా చేసుకుని పోలీస్ ఆఫీసర్‌ని అని బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8లక్షల నగదుతో పాటు రూ.17లక్షల విలువ చేస్తే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నగర క్రైం డీసీపీ దామోదర్ బుధవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మరాటీ సృజన కుమార్ అలియాస్ చరణ్(39) దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న 12 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చోరీలకు పాల్పడడంతో కేసులు నమోదయ్యాయి. అక్కడ పోలీస్ కేసులతోపాటు నిఘా పెరగడంతో విశాఖ నగరానికి మకాం మార్చేశాడు. నగర శివారులోని పోతిన మల్లయ్యపాలెం కేంద్రంగా దోపిడీలకు తెగబడ్డాడు. ఇక్కడే ఇల్లు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తూ నకిలీ పోలీస్ అవతారమెత్తాడు. రోడ్డు పక్కన మద్యం తాగేవారు, అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయిలను భయపించి వారి నుంచి రూ.10వేల నుంచి భారీగా రూ.5లక్షల వరకూ దోచుకునేవాడు. దోచుకున్న నగదుతో విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు ఇంటిలోకి అవసరమైన ఆధునిక వస్తువులు కొనుక్కున్నాడు. పెద్దలకు భయపడి కొందరు, పరువు పోతుందని కొందరు ఈ దోపిడీ విషయాలను ఎవరికీ చెప్పకపోవడంతో చరణ్ ఆటలు సాగిపోయాయి. చివరకు ఓ బుల్లెట్ కొనుక్కుని దానిపై పోలీస్ ఆఫీసర్‌ని అంటూ లోగో స్టిక్కర్ కూడా అంటించాడంటే ఎంతకు తెగించాడో అర్థం చేసుకోవచ్చు.
అత్యాశకు పోవడంతో చిక్కాడు
జూలై 29న మధురవాడ ఉడా కాలనీ నుంచి వెళ్లే ఐటీ రోడ్డులో ఓ మహిళతో కారులో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లిన చరణ్ వారిని బెదిరించాడు. తాను పోలీస్ ఆఫీసర్‌ను అని, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించడంతో సదరు జంట బెదిరిపోయారు. వారి మెడలోని బంగారు చైన్ లాక్కున్న తర్వాత... సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి బీరువాలోని నక్లెస్ కూడా లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా మరో రూ.5లక్షల నగదు ఇవ్వాలని బెదిరించడంతో సదరు వ్యక్తి స్నేహితుల నుంచి ఆ రాత్రి వేళ నగదు సమీకరించి చరణ్‌కు అందజేశాడు. జరిగిన ఘటనపై బాధితుడు పీఎం పాలెం పోలీస్‌లను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుని ఆనవాళ్లు, బుల్లెట్ వివరాలు ఆధారంగా నేర విభాగం సిబ్బంది చురుగ్గా స్పందిం చారు.
నిందితుడిని గుర్తించిన పోలీసులు నిఘా పెట్టి అనుమానం రాకుండా నార్త్ సబ్ డివిజన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం పోతిన మల్లయ్యపాలెంలో చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై ఇప్పటికే పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, ఆరిలోవ పీఎస్‌లో రెండు, త్రీ టౌన్ పీఎస్‌లో ఒక కేసు నమోదయ్యాయి. చరణ్ వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 87.84గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితుని ఇంటిలోని వాషింగ్ మెషీన్, టీవీ, కూలర్, బుల్లెట్, మరో బైక్, కారు, ç2 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.17 లక్షలకు పైనే ఉంటుందని నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని గుర్తించి ఆధారాలతో అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పీఎం పాలెం పోలీస్ స్టేసన్ సిబ్బంది పి.చిన్నరాజు, ఎం.శేఖర్, ఎస్‌ఐ జి.అప్పారావు, నార్త్ జోన్ సీఐలకు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తరఫున డీసీపీ దామోదర్ రివార్డులు అందజేసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment