సాక్షి, చెన్నై: ఓ తండ్రికి జల్సాల మీద ఉన్న ప్రేమ కొడుకు మీద లేకుండా పోయింది. విలాసాల కోసం చేసిన అప్పులను తీర్చేందుకు కన్న కొడుకును కిడ్నాప్ చేసి చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. చెన్నైలో పురసై వాక్కం కెల్లిస్ బారక్ రోడ్డుకు చెందిన రవికుమార్ పోరూర్లో ట్రావెల్స్ నడుపుతున్నాడు. ఆయన డ్రైవర్ కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ జల్సాలు చేస్తుండేవాడు. దీంతో రూ. 5 లక్షల మేరకు అప్పులయ్యాయి.
అప్పులు తీర్చేమార్గం లేక..
అప్పులను తీర్చే మార్గం లేక, చివరికి తన బిడ్డనే కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు ఆ తండ్రి. ఐనావరంలోని ఓ నర్సరీ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న కుమారుడు కనీష్(4)ను దిగబెట్టేందుకు మంగళవారం రవికుమార్ బైక్పై ఇంటి నుంచి వెళ్లాడు. కాసేపటి తర్వాత ఆటోలో వచ్చిన గుర్తు తెలయని వ్యక్తులు తనపై దాడి చేసి కనీష్ను ఎత్తుకెళ్లినట్టు, తన తండ్రి పరమశివం, భార్య తమిళ్ ఇలైక్యాకు రవి ఫోన్చేసి చెప్పాడు. మరి కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్చేసి, ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు.
సినిమాలో మాదిరి కథ చెప్పాడు..
ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, తాము చెప్పిన చోటుకు రావాలని ఆ వ్యక్తులు బెదిరించినట్లు పేర్కొన్నాడు. దీంతో ఆందోళన చెందిన పరమశివం, ఇలైక్యాలు ఇంట్లో ఉన్న నగదు, నగలను ఆగమేఘాలపై ఓ చోట కుదవ పెట్టి రూ. 5 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సాయంత్రం రవికుమార్తో కలిసి కారులో కిడ్నాపర్లు చెప్పిన ప్రదేశానికి బయలు దేరారు. అయితే, మార్గ మధ్యలో రవికుమార్ తనను మాత్రమే కిడ్నాపర్లు రమ్మన్నారని చెప్పి తండ్రి, భార్యలను దించేశాడు. రవికుమార్ చర్యలను అనుమానించిన వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
రహస్య విచారణ..
జాయింట్ కమిషనర్ మనోహర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి రహస్యంగా విచారణ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో తానేదో సినీ ఫక్కీలో శ్రమించి కనీష్ను రక్షించి తీసుకొచ్చినట్లు రవికుమార్ ఇంటికి చేరాడు. అప్పటికే ఇంటి వద్ద మాటేసిన పోలీసులు అతడ్ని తమదైన స్టైల్లో విచారంచడంతో బండారం బయట పడింది.
పెరంబూరు సమీపంలోని తన స్నేహితుడి ఇంట్లో కనీష్ను బంధించి, చిత్ర హింసలు గురి చేసినట్లు తేలింది. తన తండ్రి, భార్య వద్ద రూ.5 లక్షలు రాబట్టటం లక్ష్యంగా రవికుమార్ రచించిన నాటకం బట్టబయలయింది. దీంతో అతడిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment