కర్రలతో దాడికి పాల్పడుతున్న దృశ్యం
చార్మినార్: చార్మినార్ కట్టడం సమీపంలోని ఫరాషా హోటల్ ముందు గల ఫుట్‌పాత్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ సంఘటనలో రెచ్చిపోయిన టేలాబండి వ్యాపారులు పక్కనే ఉన్న మరో చిరు వ్యాపారిని చితక బాదారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చార్మినార్ వద్ద బహిరంగంగా అందరూ చూస్తుండగానే కర్రలతో చితకబాదారు. దాడిలో గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.
ఆదివారం చార్మినార్ ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెయిన్‌బజార్‌కు చెందిన సలీం(33) కొంత కాలంగా ఫరాషా హోటల్ ముందు ఫుట్‌పాత్‌పై టేలాబండి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇతని వద్ద పనిచేసి వేరే దుకాణం పెట్టుకున్న బార్కాస్‌కు చెందిన మహ్మద్ సయ్యద్(32), సలీం(31), మహమ్మద్(28)లు శనివారం రాత్రి సలీంతో ఘర్షణకు దిగారు. తమ దుకాణానికి అడ్డంగా కాకుండా కొద్దిగా పక్కకు జరగాలని కోరడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం మొదలైంది. దీంతో రెచ్చిపోయిన మహ్మద్ సయ్యద్, సలీం, మహమ్మద్‌లు సలీంపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ అంజయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment