అంబర్‌పేట : అందరూ సంతోషంగా పెళ్లి వేడు కల్లో మునిగిన వేళ.. ఒక్కసారిగా హాహా కారాలు వినిపించాయి. ఏమవుతుందో తెలుసుకునేలోపే అంతా జరిగి పోయింది. ఓ ఫంక్షన్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న వేళ గోడ కూలిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని గోల్నాకలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాచి గూడకు చెందిన హర్షద్ హడ్డ గోల్నాకలో పెరల్ గార్డెన్ పేరిట ఫంక్షన్ హాల్ నిర్వ హిస్తున్నాడు. కాగా నల్లకుంట నర్సింహ బస్తీకి చెందిన కొండూరు సదానందం, లలిత దంపతుల నాల్గవ కుమార్తె స్వప్నకు మహబూబ్‌నగర్ జిల్లా యాన్మగండ్ల గ్రామానికి చెందిన అంజమ్మ, జంగయ్యల కుమారుడు చంద్రశేఖర్‌తో ఆదివారం 11.49 గంటలకు మూహూర్తం నిశ్చయమైంది. దీంతో గోల్నాకలోని పెరల్ గార్డెన్‌ను బుక్ చేశారు. వధూవరులతో పాటు బంధువు లంతా ఉదయాన్నే వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహం జరిగి తలంబ్రాల తంతు ముగిస్తుండగా అందరూ భోజనాలకు బయలుదేరారు.
ఒక్కసారిగా భారీ శబ్దంతో..
ఈ సమయంలోనే వధూవరుల వేదిక వైపున్న భారీ గోడ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బయటకు కూలింది. అటుగా వస్తున్న వారిపై పడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శిథిలాల కింద పలువురు చిక్కుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందులో నర్సింహ బస్తీకి చెందిన విజయలక్ష్మి (60) శిథిలాల కింద చిక్కుకుని అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రగాయాలైన మరో ముగ్గురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరిలో కర్మన్‌ఘాట్‌కు చెందిన రాజు కుమారుడు పి.సురేశ్ (28), అంబర్‌పేటకు చెందిన ఖాజా కుమారుడు సోహెల్ (35) మహబూబ్‌నగర్ జిల్లా దేవరకొండకు చెందిన వెంకటయ్య కుమారుడు కృష్ణ (40)లు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
విజయలక్ష్మి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువు
ఫంక్షన్ హాలు యజమాని నిర్లక్ష్యమే కారణం..
పెరెల్ గార్డెన్ యాజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరమ్మతుల పేరిట ఫంక్షన్‌హాల్‌లో మధ్యలో పెద్ద గోడను నిర్మించారు. దీనికి కనీసం పిల్లర్లు, పునాది కూడా తీయలేదు. అంతేకాకుండా గోడపై ఓ పిల్లర్‌ను కూడా ఏర్పాటు చేయడంతో బరువు తట్టుకోలేకఒక్క ఉదటున కుప్పకూలింది. మరమ్మతులకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోనట్లు తెలుస్తోంది.
మరమ్మతులు పూర్తి చేసి ఇస్తామన్నాడు: సదానందం, పెళ్లి కూతురు తండ్రి
గత 45 రోజుల క్రితమే పెరెల్ గార్డెన్‌కు రాగా మరమ్మతులు జరుగుతున్నాయి. పెళ్లి నాటికి మరమ్మతులు పూర్తి చేసి అందిస్తానని చెప్పడంతో బుక్ చేసుకున్నాం. డబ్బులు కూడా చెల్లించాం. మరమ్మతులుంటే ఇవ్వకుండా ఉండాల్సింది. సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
క్రిమినల్ కేసు నమోదు: ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్
సంఘటన తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్, ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమారులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.
రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్...
సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల క్రింద ధ్వంసమైన వాహనాలను బయటకి తీశాయి. పడిపోయిన గోడ శిథిలాలను జేసీబీతో పక్కకు తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment