
ప్రమాద ఘటన వద్ద పడి ఉన్న మృతదేహాలు, రోదిస్తున్న క్షతగాత్రులు
నల్లటి చీకటిని కమ్మేసిన తెల్లటి మంచు పొరలు తెలతెలవారుతుండగా ఎర్రటి రక్తపు చారికలయ్యాయి. కొద్ది గంటల క్రితం గోవిందా గోవిందా.. అని స్మరించిన గొంతుకలు ‘ఎంత పనిచేశావు దేవుడా..’ అంటూ బోరున విలపించాయి. ఆదివారం వేకువజామున అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిలో అన్నవరప్పాడు వద్ద ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. దైవ దర్శనానికి వెళ్లి మరికొద్ది గంటల్లో గమ్యం చేరాల్సిన వీరి జీవితాలు విధి ఆడిన వింత నాటకంలో అర్ధంతరంగా ముగిసిపోయాయి. తెల్లవారుజామున సుప్రభాత గీతాలు వినిపించాల్సిన మృతుల ఇళ్లలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విషాద గీతికలై దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగాయి.
రొంపిచర్ల (నరసరావుపేట): చిన్నారి చెవులు కుట్టించుకునేందుకు బంధువులంతా కలిసి సంతోషంగా తిరుపతికి వెళ్లి వస్తూ అరగంటలో ఇంటికి చేరే సమయంలో వారిని మంచుతోపాటు ఆయిల్ ట్యాంకర్ మృత్యు రూపంలో కబళించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందులో ఇద్దరు మహిళలతోపాటు ఓ యువకుడు, చిన్నారి ఉన్నారు. ఈ దుర్ఘటన రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు గ్రామ సమీపంలో అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు జరిగింది. పిడుగురాళ్లకు చెందిన మన్విత, క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన పొత్తూరి ఝాన్సీ (40), ఆమె కుమారుడు రోహిత్ కుమార్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. కనిగిరి లెనిన్‌కుమారి, కొదమగుండ్ల త్రివేణి, కనిగిరి సహశ్రీ, కూన మంగతాయారు, కపిలవాయి భాగ్యం, కొదమగుండ్ల శరణ్, కొదమగుండ్ల ఏడుకొండలు, హనుమంతరావు, గౌతం, కొదమగుండ్ల మోతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ ద్వారా నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పిడుగురాళ్లకు చెందిన మోతి (40) మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం:డీఎస్పీ నాగేశ్వరరావు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ కే నాగేశ్వరరావు మాట్లాడుతూ రాత్రి వేళల్లో వాహనాలను పార్కింగ్ చేసే విషయంలో డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. ట్యాంకర్‌ను రోడ్డుపై పార్కింగ్ చేయటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ వెంకటరావు తమ సిబ్బందితో రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మేమెట్టా బతకాలి ?
క్రోసూరు: తల్లీ, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీకొడుకులు ఝాన్సీ, రోహిత్‌కుమార్ మృతదేహాలను స్వగ్రామమైన గుడిపాడుకు చేర్చారు. మృతురాలికి భర్త గోపాలకృష్ణ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమారుడైన రోహిత్‌కుమార్ అన్న సోమశేఖర్‌తోపాటు మండలంలోని బృగుబండ జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కూలీనాలి చేసుకుంటూ పిల్లలిద్దరినీ చదివించుకుంటున్న ఆ కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. ‘ఇక మేమెట్టా బతకాలం’టూ ఆ తండ్రీకొడుకులు హృదయ విదారకంగా విలపిస్తున్నారు.
గుండెలవిసేలా..
పిడుగురాళ్లటౌన్ : పట్టణానికి చెందిన కనిగిరి శ్రీనివాసరావుకు కొదమగుండ్ల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఏడుకొండలు బావమరుదులు. వీరంతా పట్టణంలోనే బావ శ్రీను వద్ద వివిధ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. కొదమగుండ్ల ఏడుకొండలు కుమార్తె యతిశ్రీకి చెవులు కుట్టించేందుకు తిరుపతికి ఈ నెల 22వ తేదీ రాత్రి రెండు వాహనాల్లో సుమారు 20 మంది బంధువులు బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఓ వాహనం ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో వాహనంలో ఉన్న వెంకటేశ్వర్లు భార్య మోతి, రామకృష్ణ కుమార్తె మాన్విత చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రలో నిండిపోయింది. వారం క్రితం గుడిపాడు నుంచి చెల్లెల్ని చూసేందుకు పిడుగురాళ్లకు వచ్చిన పొత్తూరి ఝూన్సీని ఈ కార్యక్రమానికి రావాలని పిలిచారు. దీంతో ఆమె కొడుకు రోహిత్‌కుమార్‌ను కూడా తీసుకొచ్చింది. ఇద్దరూ మృత్యువాత పడ్డారు. శ్రీను భార్య కాలు తీసేయడం, మొదటి బావమరిది భార్య, రెండో బావమరిది కుమార్తె చనిపోవడం, మూడో బావమరిది భార్య గర్భిణి గాయపడటంతో ఆ కుటుంబాల బాధ వర్ణణాతీతంగా ఉంది. చిన్నారి మాన్విత మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తనను ఒంటరిని చేసి వెళ్లడంతో మౌతి భర్త గుండెలవిసేలా రోదిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment