మాట్లాడుతున్న గూడూరు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ కిషోర్‌బాబు, ఎస్సై విశ్వనాథరెడ్డి
నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నలుగురు నిందితులను చెంగాళమ్మ ఆలయ సమీపంలోని వాటంబేడురోడ్డులో గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేశామని గూడూరు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాల మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బొగ్గులకాలనీకి చెందిన వి.వినయ్‌కుమార్ అలియాస్ నాని (20), టి.నవీన్ అలియాస్ లడ్డా (26), సాయినగర్‌కు చెందిన ఎ.దేవా (22), రాజేంద్రన్ తమిళసెల్వం అలియాస్ తమిళ్ తండ్రి (22) జల్సాలకు అలవాటుపడ్డారు. రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకుని బ్యాచ్‌గా ఉండి ఒంటరిగా దొరికిన వారివద్ద నుంచి సెల్‌ఫోన్లు, నగదు లాక్కోవడం చేస్తుంటారు. వారు తిరగబడితే దాడి చేసి గాయపరుస్తుంటారు.
ఊరికి వెళ్లేందుకు ఉండగా..
ఈనెల 3వ తేదీన బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి ఊరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లోని విచారణ కేంద్రంలో వివరాలు తెలుసుకుంది. అనంతరం వారిద్దరూ మొదటి నంబర్ ప్లాట్‌ఫాం మీద కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బహిర్భూమి కోసం యువతి గూడ్స్ ఇంజిన్ షెడ్ వద్దకు వెళ్లగానే గంజాయి మత్తులో జోగుతున్న నలుగురు యువకులు ఆమెను బలవంతంగా లాకెళ్లారని తెలిపారు. యువతి స్నేహితుడిపై దాడిచేసి అతని పర్సులోని రూ.500 నగదు లాక్కుని ఆమెపై పైశాచికంగా దాడి చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారు.
సైరన్ వినగానే..
అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సైరన్ వినగానే నలుగురూ యువతిని బలవంతంగా కాళంగినది ఒడ్డున అక్కంపేట రైల్వేస్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారని తెలిపారు. నిందితుల వద్ద బాధిత యువతికి సంబంధించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు నలుగురిపై నిర్భయ కేసు నమోదు చేశామని, వీరిని కోర్టులో హాజరు పెట్టనున్నామని తెలిపారు.
మహిళా రక్షక్ విభాగం ఏర్పాటు చేస్తాం
సూళ్లూరుపేట, తడ, ప్రాంతాల్లో సెల్‌ఫోన్ కంపెనీలో మహిళా కార్మికులు అధికసంఖ్యలో పనిచేస్తున్నారు కాబట్టి వీలైనంత త్వరగా మహిళా రక్షక్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించనున్నామని డీఎస్పీ తెలిపారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకదళాన్ని ఏర్పాటు చేశామన్నారు. సూళ్లూరుపేటలో లేడీస్ హాస్టళ్లు నడుపుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంపెనీల యాజమాన్యాలే సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసేలే సూచనలు ఇస్తామన్నారు. ఈ కేసు విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకుని నిందితులను పట్టుకోవడంతో చొరవ చూపిన సీఐ కిషోర్‌బాబు, ఎస్సై విశ్వనాథరెడ్డి, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఎస్పీ నుంచి క్యాష్ రివార్డులిస్తే ఆ నగదును బాధిత యువతికి అందజేస్తామని సిబ్బంది సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment