ఫేస్‌బుక్‌ యాడ్‌తో రూ.3.73లక్షలకు టోకరా | Fraud With Facebook Add In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ యాడ్‌తో రూ.3.73లక్షలకు టోకరా

Published Tue, Aug 14 2018 2:07 PM | Last Updated on Mon, Aug 20 2018 7:11 AM

Fraud With Facebook Add In Visakhapatnam - Sakshi

అల్లిపురం(విశాఖ దక్షిణ): ఫేస్‌బుక్‌ యాడ్‌ ద్వారా పర్సనల్‌ లోన్‌ ఇప్పిస్తానని రూ.3.73లక్షలు కాజేసిన యువకుడిని సైబర్‌ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఒక ఆండ్రాయిడ్‌ మొబైల్‌ఫోన్, రూ.59,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ క్రైం సీఐ వి.గోపీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం సిటీ, ఉక్కునగరం, సెక్టార్‌ – 8కు చెందిన నిడదవోలు సత్య కిరణ్‌కుమార్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పర్సనల్‌ లోన్‌ యాడ్‌ డిసిప్లే చూశాడు. దీంతో యాడ్‌ డిస్‌ప్లే చేసిన యువకుడు శ్రీకాకుళం జిల్లా, మొలియాపుట్టికి చెందిన శిరిగిడి ప్రవీణ్‌ను (6309761623) ఫోన్‌ ద్వారా సంప్రదించాడు.

దీంతో ఆ యువకుడు మోసపూరిత మాటలతో బాధితునికి పర్సనల్‌ లోన్‌ ఇప్పించనున్నట్లు నమ్మబలికాడు. అందుకుగాను అతని అకౌంట్‌లో ప్రాసెసింగ్‌ ఛార్జీల కింద రూ.3,73,840 జమ చేయాలని చెప్పాడు. దీంతో సత్య కిరణ్‌కుమార్‌ ఆ మొత్తాన్ని ప్రవీణ్‌ అకౌంట్‌లో జమచేశాడు. డబ్బు జమ చేసిన తరువాత ప్రవీణ్‌ నుంచి సమాధానం లేకపోవడంతో తాను మోసపోయానని భావించి సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్య కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఐపీసీ 419, 420 ఐటీ యాక్ట్‌ 2000–2008, 66డీ సైబర్‌ క్రైం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐ వి.గోపీనాథ్, ఎస్‌ఐ కె.రమేష్, కానిస్టేబుళ్లు కె.నాగేష్, జె.మురళి, బి.వి.రాంబాబు సహకారంతో నిందితుని గుర్తించి సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్బంగా సీఐ గోపీనాథ్‌ మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌లో లోన్‌ యాడ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని నమ్మకూడదని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌ మోసంపై కేసు నమోదు
పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో మరో ఆన్‌లైన్‌ మోసంపై కేసు నమోదయింది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీఎం పాలెం ఆఖరు బస్టాపు ప్రాంతానికి చెందిన ఎస్‌.లిఖిత్‌కుమార్‌ ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సెట్‌లో ఓ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. జయకిషన్‌ అనే వ్యక్తి వివో కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌ ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టాడు. రూ.12 వేలకు విక్రయించేందుకు అంగీకారం కుదిరింది. ఆ ప్రకారం ముందు రూ.5 వేలు ప్రకటనలో తెలిపిన బ్యాంకు అకౌంట్‌లో లిఖిత్‌కుమార్‌ జమ చేశాడు. మిగతా రూ.7 వేలు జమ చేస్తే ఫోను మీ సొంతం అవుతుందని జయకిషన్‌ చెప్పడంతో మిగిలిన మొత్తం కూడా జమ చేశాడు. అనంతరం నెల రోజులు కావస్తున్నా ఫోన్‌ పంపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన లిఖిత్‌కుమార్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దన్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement