వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాజశేఖర్ చిత్రంలో నిందితుడు
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతూ, వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగ యువతను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు త్రీటౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్సై ఎ.పైడిబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా భైరవుని పాడు గ్రామానికి చెందిన జింకాల గోపిరాజు అలియాస్ గోపి, షేక్ సుభాని అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఏలూరు కండ్రికగూడెంలో కార్పొరేట్ తరహాలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభు త్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతకు ఆశచూపించి, ఒక్కొక్కరి నుంచి రూ.6 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు.
కొందరు యువత వారికి సొమ్ములు చెల్లించి రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవటంతో త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సై పైడిబాబు సిబ్బందితో కలిసి వారి ఫోన్ నంబర్ ఆధారంగా జింకాల గోపిరాజు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.14 వేల నగదు, టేబుల్, రిఫ్రిజిరేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షేక్ సుభానీ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఇద్దరూ సుమారు వంద మందికి పైగా నిరుద్యోగ యువతను మోసం చేసి దాదాపు రూ. 6 లక్షలకు పైగా సొమ్ములు వసూలు చేసినట్టు తెలుస్తోందని, మరో వ్యక్తి సుభానీని విచారణ చేస్తే మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెప్పారు. గోపిరాజు తండ్రి వ్యవసాయం చేస్తుండగా, సుభానీ తండ్రి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నారు. నిరుద్యోగ యువత ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు చెల్లించాలని చెబితే నమ్మవద్దని, ముందుగా సొమ్ములు చెల్లించటం సరైన విధానం కాదని సీఐ రాజశేఖర్ అన్నారు. యువత ఇటువంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment