పేలుడు జరిగిన ప్రాంతం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 16 మంది పోలీసుల్ని పొట్టన బెట్టుకున్న బాంబు పేలుడుకు కీలక సూత్రధారిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. భారీ దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో దిట్టగా పేరొందిన సీపీఐ (మావోయిస్ట్) గ్రూప్ చీఫ్ నంబాల కేశవరావు (నంబాల) ఈ దాడికి నేతృత్వం వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. గడ్చిరోలి మందుపాతర పేలుడు వెనుక తెలంగాణ మావోల హస్తం ఉందన్న విషయాన్ని ‘సాక్షి’ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే.
(చదవండి : పోలీసులపై మావోల పంజా)
నంబాల కేశవరావు అలియాస్ గుర్రె బసవరాజుగా కూడా ప్రసిద్ధుడే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావో యిస్టు) కేంద్ర మిలటరీ కమాండర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన వారసుడి గా నంబాల బాధ్యతలు చేపట్టాడు. నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తెలంగాణలోని వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి. శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కేశవరావుకు వరంగల్ ఆర్‌ఈసీలో సీటు లభించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే నాటి పీపుల్స్ వార్ కార్యక్రమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అంతకుముందు– ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలకంగా పని చేసిన సమయంలో నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1984లో పార్టీలో చేరిన కేశవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నాడు.
నంబాల కేశవరావు (ఫైల్ ఫొటో)
వ్యూహాలు రూపొందించడంలో దిట్ట..
భారీ దాడులు, హత్యలకు ప్రణాళికలు రూపొందించడంలో నంబాల కేశవరావు దిట్ట. మావో కీలక నేత గణపతి సారథ్యంలోనూ పార్టీలో కీలక ఆపరేషన్లు ఇతనికే అప్పగించేవారు. గణపతి నుంచి బాధ్యతలు స్వీకరించాక, తెలంగాణలో దాడులకు పాల్పడకున్నా.. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో భీకరదాడులతో పార్టీలో తిరిగి ఉత్తేజం నింపే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే గతేడాది విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యకు నంబాల పథకం రూపొందించాడని సమాచారం. గత ఏప్రిల్ 9వ తేదీన తొలిదశ పోలింగ్ ముగిశాక ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను పేల్చేయడంలో కూడా నంబాల కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంబాల తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది. ఇతని కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కూడా వెదుకుతోంది.
కలసి వచ్చిన పోలీసుల నిర్లక్ష్యం..!
గడ్చిరోలి దాడిలో పోలీసుల నిర్లక్ష్యంవల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. పోలీసులను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు లక్ష్యాన్ని ఛేదించారు. కుర్ ఖేడా అటవీ ప్రాంతంలో ముందుగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తోన్న యంత్రాలు, వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టి పోలీసులను ఉచ్చులోకి లాగారు. వాస్తవానికి ఏదైనా ఘటన జరిగితే సమాచారం అందుకున్న వెంటనే తమపై దాడి జరిగే ప్రమాదముందని వెంటనే వెళ్లరు. కానీ, బుధవారం మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి సివిలియన్ వెహికల్‌లో వెళ్లారు. పైగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన చెట్లను పక్కకు తీసే ప్రయత్నం చేసి భారీ తప్పిదం చేశారు. అదే సమయంలో అదనుచూసి అత్యంత శక్తిమంతమైన ఐఈడీ అమర్చిన మందుపాతరను పేల్చేయడం ద్వారా 16 మందిని మావోయిస్టులు పొట్టన బెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment