కర్నూలు, వెల్దుర్తి: పట్టణ సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇంటి గది పూర్తిగా ధ్వంసమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన గొల్ల మురళి, భార్య లక్ష్మి (దివ్యాంగురాలు) రెండు సంవత్సరాలుగా.. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఎల్లకృష్ణ, పరశురాముడు ఉన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోని కార్మికులకు నిర్మించిన గదిలోనే కుటుంబమంతా నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కరెంట్ ఆఫ్ చేసుకుని, తలుపులు, కిటికీలు మూసుకుని నిద్రించారు. మురళి.. బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో నిద్ర లేచి లైట్ వేయడంతో అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. మంటలు వ్యాపించడంతో మురళితోపాటు నిద్రిస్తున్న అతని భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి గది తలుపులు, కిటికీలతో సహా మూడు వైపులా ఉన్న ఇటుక గోడలు చెల్లాచెదురయ్యాయి. పైకప్పు కూలిపోయింది. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మురళి, అతని భార్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెల్దుర్తి తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్‌ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్‌ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు
ప్రమాదానికి కారణమేమి?
కుటంబ సభ్యులు నిద్రిస్తున్న గదిలోనే వంట గది కలిసి ఉండడం, వంటకు ఉపయోగించే గ్యాస్ లీకై రాత్రంతా గదిలో వ్యాపించి, మురళి లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిద్రించే సమయంలో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతోపాటు, స్టవ్ నాబ్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడమా?, లేదా సిలిండర్, పైప్ లీకేజీనా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో కేవలం కుటుంబ సభ్యులకే మంటలు వ్యాపించడం, తక్కిన ఏ వస్తువులకూ ఏమీ కాకపోవడం, గదిలోనే ఉన్న గొర్రెపిల్ల క్షేమంగా ఉండడం బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్‌ఐ మధుసూదన్ రావ్ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
పేద కుటుంబంలో తీవ్ర విషాదం
గ్యాస్ ప్రమాదంలో గాయపడ్డ మురళి, భార్య లక్ష్మి 15 ఏళ్లుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమైనా ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన గదిలోనే తలదాచుకుంటూ తమ ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment