కొమానపల్లిలో బాధితురాలు అమ్మాజీ, తల్లిదండ్రులను విచారిస్తున్న డీఎస్పీ తిలక్
సాక్షి, తూర్పుగోదావరి(ముమ్మిడివరం) : ప్రేమించిన ప్రియుడు వివాహ ముహూర్తం పెట్టాక ముఖం చాటేయడంతో ప్రియురాలి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు ఛీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కాకినాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ యాక్టు విభాగం డీఎస్పీ ఏబీజే తిలక్, ఎస్సై వెంకటరమణ మండలంలోని కొమానపల్లిలో బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వంగలపూడి అమ్మాజీ, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన అప్పాడి రాజేష్ అమలాపురంలో కంప్యూటర్ విద్య నేర్చుకొనే సమయంలో ప్రేమించుకున్నారు. ఆ తరువాత అమ్మాజీ ముమ్మిడివరంలో హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న సమయంలో రాజేష్ గత జూలై నెలలో పెళ్లి చేసుకుంటానని అమలాపురం సాయిబాబా గుడికి తీసుకు వెళ్లి నుదుట విభూది బొట్టు పెట్టి అక్కడి నుంచి ఓడల రేవు బీచ్‌కు తీసుకువెళ్లాడు.
29న హైదరాబాద్ ఆర్య సమాజానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు అక్కడ వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. విషయం అమ్మాజీ తల్లిదండ్రులకు తెలియడంతో కొమానపల్లి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఆగస్టు 25న వారికి పెళ్లి చేయడానికి రాజేష్ తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే ఫైనాన్స్ కంపెనీలో తగవు ఉందని చెప్పి ఆగస్టు 17న స్నేహితులతో కలిసి వెళ్లిన రాజేష్ తిరిగి రాలేదని ఈ విషయంపై రాజేష్ తండ్రిని నిలదీస్తే వారి పెళ్లికి కులం అడ్డుగా చూపి నిరాకరించాడని అమ్మాజీ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ముమ్మిడివరం ఎస్సై ఎం.పండుదొర ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్వగృహంలో సోమ వారం అమ్మాజీతో పాటు తల్లిదండ్రులు శంకరరావు, సత్యవతిలను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment