దాడిలో గాయపడిన పవన్‌కుమార్ (పాత చిత్రం)
విశాఖపట్నం: ఎంవీపీ కాలనీ రోప్‌వే వద్ద పవన్‌కుమార్‌పై దాడి కేసు మిస్టరీ వీడిపోయింది. అతని మాజీ ప్రియురాలే సూత్రధారిగా కొందరు వ్యక్తులతో దాడి చేయించిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎంవీపీ పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. ఎంవీపీ కాలనీ దరి వాసవానిపాలెంకు చెందిన పల్లవి(24)కి కొద్ది సంవత్సరాల కిందట అశోక్‌కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా వున్నాడు.
వివాహం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల పల్లవి భర్తకు దూరమయింది. అనంతరం 2014లో దుబాయ్ చేరుకుని ఓ ప్లే స్కూల్‌లో ఉద్యోగంలో చేరింది. సీతమ్మధార దరి ఎంఎంటీసీ కాలనీకి చెందిన పవన్‌కుమార్ (27) 2016లో దుబాయ్ చేరుకుని ఒక సెక్యూరిటీ కంపెనీలో సీసీ ఫుటేజీ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమంగా మారింది. అదే సమయంలో పవన్ వద్ద పల్లవి రూ.40వేలు అప్పుగా తీసుకుంది. అనంతరం పెళ్లి చేసుకోవాలని పవన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు పవన్‌కుమార్ నిరాకరించాడు.
బాకీ తీరుస్తానని రమ్మని...
ఈ నేపథ్యంలో వీసా కాలపరిమితి ముగియడంతో ఈ నెల 10వ తేదీన పవన్‌కుమార్ విశాఖ వచ్చాడు. విషయం తెలుసుకున్న పల్లవి కూడా దుబాయ్ నుంచి విశాఖ వచ్చింది. విశాఖ వచ్చిన పల్లవికి పవన్‌కుమార్ ఫోన్ చేసి రూ.40వేల బాకీ కోసం అడిగాడు. దీంతో ఈ నెల 14వ తేదీన పల్లవి ఎస్‌ఎంఎస్ చేసి రమ్మనడంతో నగదు కోసం పవన్‌కుమార్ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఎంవీపీ కాలనీ రోప్‌వే వద్దకు చేరుకుని నిరీక్షిస్తుండగా... ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం తెలిసిందే. తనను బాకీ కోసం ఒత్తిడి చేస్తున్నాడన్న కారణంతో తన భర్త అశోక్‌కుమార్‌కి పల్లవి సొమ్ము ఇచ్చి పవన్‌కుమార్‌పై కొందరు వ్యక్తులతో దాడి చేయించింది.
కేసు దర్యాప్తు చేసిన ఎంవీపీ పోలీసులు నిందితులను బుధవారం పెదవాల్తేర్ శ్మశానవాటిక సమీపంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచడంతో న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. పల్లవి, ఆమె భర్త అశోక్‌కుమార్‌తో పాటు వి.సతీష్, పల్లా అనిల్, వై.సంతోష్‌కుమార్, భరణికాన రవిలను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు శివ, అజయ్ పరారీలో ఉన్నారని ఎంవీపీ ఎస్‌ఐ ఈ.ధర్మేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కాగా, వీరంతా ఆటోడ్రైవర్, ప్లంబింగ్, క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్ప్రత్రి నుంచి పవన్‌కుమార్ ఇటీవల డిశ్చార్జి అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment