పోగొట్టుకున్న నగను తిరిగి అందజేస్తున్న ఏఎస్‌ఐ.
సాలూరు : పట్టణంలోని రాపాకవీధికి చెందిన సంగినేని సావిత్రి తన చేతి పర్సులో దాచుకున్న రెండున్నర తులాల బంగారు నక్లెస్‌ను జారవిడుచుకుంది. తిరిగిన రోడ్లన్నీ వెదికింది. ఫలితం లేకుండాపోయింది. బోరుమంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటిలోనే పోగొట్టుకున్న నగను తిరిగి సావిత్రికి అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...సావిత్రి తన చేతిపర్సులో భద్రంగా దాచుకుని బోసుబొమ్మ జంక్షన్ గుండా నడుచుకుంటూ వెళ్తూ పర్సును చేజార్చింది. కొద్దిసేపటికి పర్సును పోగొట్టుకున్న విషయం గుర్తించి గాలించింది. ఎవరి చేతికో చిక్కిందన్న విషయం గుర్తించి, చేసేది లేక పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది.
కానిస్టేబుల్ హరి క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకుని విచారించారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించాడు. ఆ ప్రాంతంలోని వ్యాపారులను విచారించాడు. సీసీ పుటేజీలో తాము నగతీసిన వ్యక్తిని గమనించామని, తీసిన నగను తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తనదైన శైలిలో హెచ్చరించడంతో కొద్ది క్షణాలలోనే పోగొట్టుకున్న పర్సుతో పాటు బంగారు నగ కూడా రోడ్డుపై ప్రత్యక్షమైంది. ఆ నగను ఏఎస్‌ఐ శ్రీనివాసరావు సావిత్రమ్మకు తిరిగి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ విషయమై పట్టణ ఎస్‌ఐ ఫకృద్దీన్ మాట్లాడుతూ చాకచక్యంగా వ్యవహరించి, నగను పోగొట్టుకున్న మహిళలకు తిరిగి దక్కేలా చేసిన కానిస్టేబుల్ హరికి పోలీసుశాఖ ద్వారా రివార్డు వచ్చేలా సిఫారసు చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment