స్వాధీనం చేసుకున్న బంగారపు, వెండి వస్తువులు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పట్టపగలే ఇళ్లకు వేసిన తాళాలు పగలకొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులను చోరీ చేసే నలుగురు యువకులను ధవళేశ్వరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4.80లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు స్కూటీపెప్, సీబీజెడ్ బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైం) వైవీ రమణకుమార్ వెల్లడించారు.
ఈనెల 17న రాజవోలు రమాదేవిగార్డెన్స్‌కు చెందిన నండూరి పద్మావతి మధ్యాహ్నం తన ¿భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలుగొట్టి ఉండి, గదిలో బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో ఈనెల ఐదో తేదీన అడిషనల్ ఎస్పీ(క్రైం), రాజమహేంద్రవరం సౌత్‌జోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలశౌరి, ఎస్సై కేశవరావు, వారి సిబ్బంది, సీసీఎస్ ఎస్సై ఎండీ జుబేర్, వారి సిబ్బందితో కాటన్ విగ్రహం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యానాం ప్రాంతానికి చెందిన టేకుముడి దుర్గాప్రసాద్, లాలాచెరువు ప్రాంతానికి చెందిన తోణంగి సతీష్, రాజమహేంద్రవరం తుమ్మలావకు చెందిన గొర్రెల చినబాబు, కలవచర్ల గ్రామానికి చెందిన ఆదాము సతీష్‌లను అరెస్టు చేసి విచారించారు. పోలీసుల విచారణలో వారు ఈ ఏడాది చేసిన చోరీల వివరాలను వెల్లడించారు.
15ఏళ్ల ప్రాయం నుంచే...
యానాంకు చెందిన టేకుమూడి దుర్గాప్రసాద్ 15ఏళ్ల వయస్సు నుంచే చిన్నచిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2016లో సైదాబాద్ జువైనెల్‌హోమ్, 2017లో చిలకలగూడ చోరీకేసులో మరోసారి సైదాబాద్ జువైనెల్‌హోమ్, అదే ఏడాది, 2018లో రాజమహేంద్రవరం జువైనెల్‌హోమ్, 2018లో సైదాబాద్ జువైనెల్‌హోమ్, 2019లో రాజమహేంద్రవరం జువైనెల్ హోమ్‌కు రెండుచోరీ కేసుల్లో వెళ్లివచ్చాడన్నారు. తోణంగి సతీష్, గొర్రెల చినబాబు చోరీ కేసుల్లో రాజమహేంద్రవరం వెళ్లారన్నారు. సమావేశంలో సౌత్‌జోన్ డీఎస్పీ విజయకుమార్, క్రైం డీఎస్పీ కుమార్, ధవళేశ్వరం ఇన్‌స్పెక్టర్ బాలశౌరి, ఎస్సైలు కేశవరావు, ఎండి.జుబేర్, నిందితులను అరెస్టు చేయడంలో చొరవచూపిన పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
చేసిన చోరీలివే..
♦ ఏప్రిల్ నెలలో విశాఖజిల్లా గాజువాక కూర్మన్నపాలెంలో ఓ ఇంటి తలుపులు పగలు కొట్టి, ఆ ఇంటిలో దొరికిన తాళంతో సీబీజెడ్ బైక్‌ను దొంగిలించారు.
♦ ఏప్రిల్ 17న రాజవోలు రమాదేవిగార్డెన్స్‌లోని ఒక ఇంటిలో బంగారపు, వెండి వస్తువుల చోరీ.
♦ మే 9వ తేదీన హైదరాబాద్‌లోని చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక తాళం వేసిన ఇంటిలో మంగళసూత్రపు తాడు చోరీ.
♦ కొత్తపేట మండలం అవిడిగ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో తాళాలు పగలుగొట్టి బంగారు, వెండివస్తువుల చోరీ.
♦ ఏప్రిల్ రెండోవారంలో రాజమహేంద్రవరం గోదావరిగట్టు వద్ద తాళంవేసిన ఇంటిలో, తాళాలు పగలు గొట్టి బంగారు వస్తువుల చోరీ
♦ ఏప్రిల్ నాలుగోవారంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు తాళం వేసి ఉన్న ఇంటిలో, తాళాలు పగలుగొట్టి బంగారు, వెండివస్తువులు చోరీ.
♦ మే మొదటి వారంలో బొమ్మూరు బిజాపురి ఏరియాలో ఒక తాళం వేసిన ఇంటిలో, తాళాలు పగలు గొట్టి నగదు, సెల్‌ఫోన్ చోరీ
♦ మే మొదటి వారంలో బొమ్మూరులో తాళం వేసి ఉన్న స్కూటీ పెప్‌ను దొంగిలించారు.
చోరీ సొత్తు స్వాధీనం
నిందితులు చోరీ చేసిన 148 గ్రాముల బంగారపు వస్తువులు( రూ.నాలుగులక్షలు విలువ), 2.7కిలలో వెండివస్తువులు (రూ.80వేలు)లతో పాటు, స్కూటీపెప్, ఒక సీబీజడ్ బైక్, ఒక మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ రమణకుమార్ తెలిపారు. వీరితో పాటు మోరంపూడి ప్రాంతానికి చెందిన పల్లపాటి దుర్గాప్రసాద్(పెట్రోలు) పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. వీళ్లందరూ పట్టపగలే చోరీ చేస్తారని, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పగలుగొట్టి బీరువాల్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, బయట పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లిపోతుంటారన్నారు. వేసవికాలం ఇంకా ముగియనందున ప్రజలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్) డౌన్‌లోడు చేసుకుని పోలీసులతో సమన్వయం చేసుకుంటేనేరాలు జరుగకుండా తాము జాగ్రత్తలు చేపడతామని అడిషనల్ ఎస్పీ రమణకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment