
మోసపోయిన తల్లీకూతుళ్లు
విజయనగరం , సాలూరు: అపరిచితులను...మెరుగు పేరుతో వచ్చేవారిని నమ్మవద్దని పోలీస్ శాఖాధికారులు వాడవాడలా ప్రచారం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అమాయక మహిళలు మోసగాళ్ల బారిన పడి బంగారాన్ని పోగొట్టుకుంటున్నారు. గత నెల 20వ తేదీన పార్వతీపురం మండల కేంద్రం సంకావీధిలోని అత్తా,కోడళ్లయిన కాంతరత్నం, అనూషలను మెరుగు పేరుతో దుండగులు మోసం చేసి 13 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించిన సంఘటన మరువక ముందే మళ్లీ అలాంటి సంఘటనే సాలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని యామజాలవారి వీధికి చెందిన పెండ్రాల సుధ ఇంటిలో టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు సుధ ఇంటికి వచ్చి తమ వద్ద వస్తువులకు మెరుగు పెట్టే పౌడర్ ఉందని.. ప్యాకెట్ కేవలం రూ. 20 మాత్రమేనని చెప్పారు. తొలుత అయిష్టత వ్యక్తం చేసిన సుధ అనంతరం వారి మాటలకు లొంగింది. ఇంకేముంది ఆమె కాళ్ల పట్టీలతో పాటు రాగి ముంతను రసాయనాల్లో ముంచి ధగధగ మెరిసేటట్లు చేశారు. ఆపై బంగారు నగలకు సైతం మెరుగు పెడతామంటూ నమ్మబలికారు. దీంతో సుధ తన మూడు తులాల చంద్రహారాన్ని, ఆమె తల్లి సూర్యకాంతం మూడు తులాల గొలుసును మోసగాళ్లకు అందించారు. దీంతో వారు చిన్న కప్పు తీసుకుని అందులో రసాయనం వేసి నగలు వేస్తున్నట్లుగా నటించి చిన్న రాయి వేశారు. కాసేపు వేడి చేస్తే నగలు మెరిసిపోతాయంటూ కప్పును సుధ చేతికందించారు. కప్పులోనే నగలు ఉన్నాయని భ్రమించిన సుధ వాటిని స్టవ్ మీద పెట్టేందుకు వెళ్తుండగా.. మోసగాళ్లు ఒక్కసారిగా పరుగందుకున్నారు. వెంటనే కప్పులో చూడగా నగలకు బదులు రాయి ఉండడంతో తల్లీకూతుల్లు లబోదిబోమంటూ వీధిలోకి పరుగెట్టారు. అప్పటికే మోసగాళ్లు పరారవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment