సీఐ రంగస్వామి అభినందిస్తున్న రష్యన్ అధికారి , నిందితుడు రంగబాబు
న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయాన్నే మోసగించి 42,500 అమెరికన్ డాలర్లు( రూ.28 లక్షలు) కొట్టేశాడో మోసగాడు. కార్యాలయంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆన్‌లైన్ ద్వారా పనులు చేజిక్కించుకున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు...ముందుగా డబ్బులు తీసుకుని పనులు చేయకుండా తప్పించుకోవడంతో రష్యన్ కార్యాలయ సెక్రటరీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన నగర పోలీసులు గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రంగబాబును గుర్తించి పట్టుకున్నారు.
గచ్చిబౌలి: న్యూఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో రాడార్ ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో పనులు చేజిక్కించుకున్న వ్యక్తి మొత్తం డబ్బులు తీసుకుని పరారు కాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని డబ్బు రికవరీ చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో ఎస్‌ఐఆర్ గ్రౌండ్ పెనెట్‌రేటింగ్ రాడార్ ఏర్పాటు కోసం 2016 మే నెలలో ఆన్‌లైన్ టెండర్లు పిలిచారు. సరూర్‌నగర్‌లోని కేఆర్‌బీ జీఈఐఓ సర్వీసెస్ సీఈఓగా వ్యవరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు ఆన్‌లైన్ రాడార్ ఏర్పాటు టెండరు దాఖలు చేసి 42,500 అమెరికన్ డాలర్లు(రూ.28 లక్షలు)లకు కోట్ చేసి పనులు దక్కించుకున్నారు.
మొత్తం డబ్బు తన ఖాతాలో జమ చేస్తేనే పనులను ప్రారంభిస్తానని చెప్పడంతో రష్యన్ ఫెడరేషన్ రాయబార కార్యాలయం సదరు మొత్తాన్ని రంగబాబు అకౌంట్‌లోకి బదిలీ చేసింది. జీఎస్‌టీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరికొంత డబ్బు కావాలని కోరగా, రష్యన్ అధికారులు అంగీకరించలేదు. దీంతో అతను పనులు ప్రారంభించకపోగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో సదరు కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ 2017 సెప్టెంబర్ 29న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేయగా, సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హుడా కాలనీలో అతడికోసం గాలించగా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లినట్లు గుర్తించారు. గుంటూరులోని మారుమూల ప్రాంతంలో రంగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్న మొత్తాన్ని రష్యన్ ఫెడరేషన్ రాయబారి అకౌంట్‌లోకి జమ చేయించినట్లు తెలిపారు. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా రంగబాబు వ్యవహరించాడని కేసును దర్యాప్తు చేసిన డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వేణుగోపాల్, సీఐ రంగస్వామిలను సీపీ అభినందించారు. డబ్బు తిరిగి అకౌంట్‌లో జమ కావడంతో కోర్టులో కేసు ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. చాలా మంది వద్ద డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడటం గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వడం రంగబాబుకు పరిపాటేనని పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసులకు ప్రశంస...
సీపీ మహేశ్ భగవత్‌తో పాటు రష్యన్ ఫెడరేషన్ రాయబారి కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ రాయబారి నికోలాస్ కుదసెవ్ అభినందనలు తెలిపిన లేఖను చదివి వినిపించారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసిన తీరును ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment